పలమనేరు, ఆగస్టు 06 ( గరుడ ధాత్రి ) :
అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పలమనేరు అర్బన్ సెక్టారు పరిధిలోని హెచ్.డబ్ల్యూ అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిడిపిఓ ఉమారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్ నజ్మా, సిడిపిఓ ఉమారాణి గర్భవతులు, బాలింతలు మరియు తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై పలు సూచనలు, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఉమారాణి మాట్లాడుతూ… తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని పేర్కొన్నారు. ప్రసవం తర్వాత వచ్చే మొదటి పాలు (ముర్రుపాలు) శిశువుకు తొలి టీకా లాగా పనిచేస్తాయని, ఇవి ఆరు నెలల వరకు బిడ్డకు అవసరమైన రోగనిరోధక శక్తిని అందిస్తాయని తెలిపారు. ముర్రుపాలు ఇవ్వడం వల్ల రేచీకటి రాకుండా చూడటంతో పాటు, ఆరు నెలల వరకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా బిడ్డను కాపాడుతాయన్నారు. తల్లిపాలలో బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయని, అందుకే ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేశారు. సూపర్‌వైజర్ నజ్మా మాట్లాడుతూ… బిడ్డ జన్మించిన రెండు సంవత్సరాల లోపే 80 శాతం మెదడు అభివృద్ధి జరుగుతుందని, దీనివల్ల తల్లిపాలు తాగే పిల్లల్లో ఐక్యూ (IQ) స్థాయి పెరుగుతుందని తెలిపారు. ఏడవ నెల నుండి రెండు సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు నాణ్యమైన అనుబంధ ఆహారాన్ని తప్పనిసరిగా అందించాలని, అలాగే మొదటి ‘వెయ్యి రోజుల సంరక్షణ’ ప్రాధాన్యతను వివరించారు. ఇదే క్రమంలో డబ్బా పాలు (పోత పాలు) ఇవ్వడం వల్ల కలిగే నష్టాలను, తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లులకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఎలా రక్షణ లభిస్తుందో వివరించారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి, బిడ్డకు మధ్య ప్రేమానురాగాలు పెరగడమే కాకుండా తదుపరి కాన్పుకు మధ్య సహజమైన వ్యవధి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు మమత, స్వాతిలతో పాటు పెద్ద సంఖ్యలో గర్భవతులు, బాలింతలు మరియు తల్లులు పాల్గొన్నారు.