GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 10:20 pm Digital Edition : GURU SWAMY

అద్దె ఇంట్లో మగ్గం నేస్తే నేతన్న కాదా..?

– నేతన్న సేవలో అద్దె చేనేతలకు న్యాయం చేయాలని దేవాంగ అభ్యుదయ సేవా సంఘం విజ్ఞప్తి

సత్యవేడు, ఆగస్టు 06 గరుడధాత్రి:

రాష్ట్రవ్యాప్తంగా అద్దె ఇళ్లలో నివసిస్తూ సంప్రదాయ చేనేత వృత్తిని కొనసాగిస్తున్న వేలాది మంది నేతన్నలకు “నేతన్న సేవ” పథకం అమలులో జరుగుతున్న అర్హత ప్రమాణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సొంత ఇల్లు లేని కారణంగా అద్దె ఇళ్లలో మగ్గం నేస్తున్న చేనేత కుటుంబాలను అనర్హులుగా పరిగణించడం సామాజిక న్యాయానికి విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ దేవాంగ అభ్యుదయ సేవా సంఘం అధ్యక్షులు గుత్తి త్యాగరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హెచ్‌ఆర్‌డీ మంత్రి నారా లోకేష్, చేనేత శాఖ మంత్రి ఎస్. సవితలకు ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా వినతిపత్రాలు పంపినట్లు తెలిపారు.
గుత్తి త్యాగరాజు మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా అనేక మంది చేనేత కార్మికులు అద్దె ఇళ్లలోనే మగ్గాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం నేతన్న సేవ పథకంలో అద్దె ఇంట్లో నివసించే వారికి ఇంటి యజమాని నుంచి అఫిడవిట్ సమర్పించాలని నిబంధన విధించడం వల్ల అర్హులైన అనేక మంది పథకానికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటి యజమానులు వ్యక్తిగత కారణాలు, భయాలు, అపోహలతో అఫిడవిట్ ఇవ్వడానికి వెనుకాడుతున్నారని, మరికొన్ని చోట్ల పథకం ద్వారా వచ్చే లబ్ధిలో వాటా కోరుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. దీనివల్ల నిజమైన పేద చేనేత కుటుంబాలే ఎక్కువగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు.
అలాగే ప్రస్తుతం ఉచిత విద్యుత్ పొందుతున్న వారిలో కొందరికి మగ్గం లేకపోయినా , చేనేత వృత్తి చేయకపోయినా లబ్ధి అందుతుండగా, నిజంగా మగ్గం నేస్తున్న అద్దె ఇంటి చేనేతలను అనర్హులుగా చేయడం సమంజసం కాదన్నారు.
గతంలో మగ్గాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తించేవారని, ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించి ప్రతి మగ్గాన్ని పరిశీలించి నిజంగా చేనేత వృత్తి చేస్తున్న కుటుంబాలకు సొంత ఇల్లు, అద్దె ఇల్లు అనే తేడా లేకుండా నేతన్న సేవ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రత్యేకించి ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం అనంతరం అయినా ప్రత్యేక సమీక్ష నిర్వహించి, అద్దె ఇళ్లలో మగ్గం నేసే వారు, వీవర్ షెడ్లలో మగ్గం నేసే వారందరికీ నేతన్న సేవ పథకం వర్తింపజేసి అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి న్యాయం చేయాలని గుత్తి త్యాగరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
చేనేత వృత్తిని కొనసాగిస్తున్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు సమానంగా అందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చేనేత వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.