GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 5:31 am Digital Edition : GURU SWAMY

అభిమానుల సందడి మధ్య.. ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

పిచ్చాటూరు, ఆగస్టు 22 గరుడధాత్రి :

మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని పిచ్చాటూరులో అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. పిచ్చాటూరు మీ సేవ నిర్వాహకులు విజయ్ @ జార్జి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమాన నటుడిపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు.
ఈ సందర్భంగా విజయ్ @ జార్జి మాట్లాడుతూ.. చిరంజీవి అనే పేరు వినగానే కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ కళ్లముందు మెదులుతుందని అన్నారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ స్థాయికి చేరుకున్న చిరంజీవి ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
వెండితెరపై చిరంజీవి చేసే డ్యాన్స్‌, ఆయన పలికే డైలాగులు, నటన, స్టైల్‌కు ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉందన్నారు. ఎన్నో దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు సినిమా రంగంలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. చిరంజీవి నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలకు చేరువయ్యారని తెలిపారు.
తమ అభిమాన నటుడి జన్మదిన వేడుకలను అభిమానుల సమక్షంలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని విజయ్ @ జార్జి అన్నారు. అభిమానుల ప్రేమ, ఆదరణ చిరంజీవిపై ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
అనంతరం చిరంజీవి చిత్రపటానికి అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ప్రజలకు కేక్‌, స్వీట్లు పంచిపెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ వేడుకల్లో చిరంజీవి అభిమానులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. “మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి” అంటూ నినాదాలు చేస్తూ జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించారు.