GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 7:15 am Digital Edition : GURU SWAMY

ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం

– స్కిల్ ఇండియా కార్యక్రమంపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నలకు కేంద్రం సమాధానం
*- శిక్షణ, సర్టిఫికెట్లతో పాటు ఉపాధి అవకాశాలకు ప్రత్యేక చర్యలు
*- నెల్లూరు జిల్లాలో వేలాది మందికి నైపుణ్య శిక్షణ, అప్రెంటిస్‌షిప్ అవకాశాలు

దేశంలో స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ (సిప్) అమలు తీరు, ఇప్పటివరకు శిక్షణ పొంది, సర్టిఫికేట్ సాధించిన అభ్యర్థుల వివరాలు, అందుబాటులో ఉన్న శిక్షణ కేంద్రాలు, సంస్థల సంఖ్య, శిక్షణ పొందిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, ‘స్కిల్ ఇండియా డిజిటల్ హబ్’ నిర్వహణ వంటి పలు అంశాలపై నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్‌సభలో కొన్ని ప్రశ్నలు అడిగారు. అడిగిన లిఖితపూర్వక ప్రశ్నలకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి గారు సోమవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

*మూడు ప్రధాన పథకాలతో ‘స్కిల్ ఇండియా’*
స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ జన్ శిక్షణ్ సంస్థాన్ అనే మూడు ప్రధాన పథకాల ద్వారా అమలవుతోందని కేంద్ర మంత్రి వెల్లడించారు. పి ఎం కె వీవై 4.0 కింద యువతకు షార్ట్-టర్మ్ ట్రైనింగ్ తో పాటు రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ అందిస్తున్నారని, ఇందులో పరిశ్రమలకు తగిన ఆన్-ది-జాబ్ ట్రైనింగ్ కి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పీఎంకేవీవై పథకం తొలి మూడు వెర్షన్లు అయిన 1.0, 2.0, 3.0లలో (2015-16 నుంచి 2021-22 వరకు) షార్ట్-టర్మ్ ట్రైనింగ్ విభాగంలో ప్లేస్‌మెంట్లను ట్రాక్ చేసినట్లు, అయితే ప్రస్తుతం అమలవుతున్న 4.0 వెర్షన్‌లో శిక్షణ పొందిన అభ్యర్థులు తమకు నచ్చిన కెరీర్ మార్గాన్ని ఎంచుకునేలా ఆన్-జాబ్ ట్రైనింగ్‌ ద్వారా అవగాహన కల్పించడంపై దృష్టి సారించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఎన్ ఏ పి ఎస్ 2 పథకం ద్వారా అప్రెంటిస్‌లకు నెలకు ఇచ్చే స్టైపెండ్‌లో 25 శాతం (గరిష్టంగా రూ. 1,500) సాయాన్ని డీబీటీ ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నామని పేర్కొన్నారు. 15 నుంచి 45 ఏళ్ల వయస్సు కలిగిన నిరక్షరాస్యులు, డ్రాపౌట్లకు స్వచ్ఛంద సంస్థల (NGOs) ద్వారా స్థానికంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి పెంచేందుకు జన్ శిక్షణ్ సంస్థాన్ ఉపయోగపడుతోందన్నారు.