GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 8:48 am Digital Edition : GURU SWAMY

ఆగస్టు 17 నుంచి జిల్లా జనాభా గణాంక హ్యాండ్‌బుక్ సర్వే ప్రారంభం

కార్వేటినగరం, ఆగస్టు 7: (గరుడాదాద్రి న్యూస్):
జిల్లా జనాభా గణాంక హ్యాండ్‌బుక్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు నిర్వహించనున్న గ్రామాల మౌలిక వసతులు, ప్రజా సౌకర్యాల గణనకు సంబంధించి శిక్షణ కార్యక్రమం శుక్రవారం కార్వేటినగరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు.ఈ శిక్షణలో కార్వేటినగరం, పాలసముద్రం మండలాలకు చెందిన సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాల్లో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, రవాణా, సమాచార సౌకర్యాలు తదితర మౌలిక వసతులు మరియు ప్రజలకు అందుబాటులో ఉన్న వివిధ సౌకర్యాల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించే విధానంపై అధికారులు సమగ్రంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి పాలసముద్రం తహసీల్దార్ శ్రీ గుర్రప్ప ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, గణనను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం ఖచ్చితత్వంతో నిర్వహించాలని సూచించారు. కార్వేటినగరం డిప్యూటీ తహసీల్దార్ లోకేష్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ నాగార్జున, జూనియర్ అసిస్టెంట్ శ్రీవిద్య గణన విధానం, ఫారాల నింపడం, సమాచార సేకరణలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు.
శిక్షణలో పాల్గొన్న సిబ్బంది సందేహాలను అధికారులు నివృత్తి చేసి, ఆగస్టు 17 నుంచి ప్రారంభమయ్యే క్షేత్రస్థాయి గణనను సమయానికి పూర్తి చేయాలని సూచించారు.