పలమనేరు,ఆగస్టు04 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు మున్సిపల్ పరిధిలోని టి.ఎస్ అగ్రహారం కొండపై వెలసిన వళ్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మ ణ్యస్వామి ఆలయంలో ఆడికృత్తిక బ్రహ్మాత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈనెల 6 నుంచి 8 వరకు బ్రహ్మాత్సవాలు నిర్వహించనున్నారు. తొలిరోజు ఉదయం స్వామి వారికి అమ్మవార్లకు పుణ్యాహవచనం పంచామృత అభిషేకాలు నిర్వహించాక శివకోటి ప్రారంభిస్తారు. 7వతేదీ శుక్రవారం కృత్తిక నక్షత్రం సందర్భంగా స్వామి వారికి అమ్మ వార్లకు ప్రత్యేక అభిషేకాలు, కావడి చెల్లింపులు, రాత్రి వీధినాటకం ప్రదర్శించనున్నారు. 8న పంచామృత అభిషేకాలు, రాత్రి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అన్నదానం, ప్రసాద వితరణ చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. భక్తులు తలనీలాలు సమర్పించుకొనేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలు సందర్బంగా ఆలయం వద్ద విద్యుద్దీపాలంకరణ పనులు చేపట్టారు. పారిశుధ్యం తదితర సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ కమిషనర్ లోకేశ్వరవర్మ చర్యలు తీసుకుంటున్నారు.