GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 6:55 pm Posted by : GARUDA DHATRI NEWS

ఆదర్శ నాయకులు అన్న ఎన్.టీ రామారావు – ఎమ్మెల్యే ఆదిమూలం

ఆదర్శ నాయకులు అన్న ఎన్.టీ రామారావు
-ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
-నారాయణవనం, పిచ్చాటూరులలో ఘనంగా అన్న జయంతి వేడుకలు

గరుడధాత్రి న్యూస్ :

ఆదర్శ నాయకులు.. యుగ పురుషుడు.. ఆంధ్ర ప్రజల అభిమాన అన్న.. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామా రావు అని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొనియాడారు.
గురువారం ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నారాయణవనం పిచ్చాటూరు లలో జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకలలో కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యుగ పురుషుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి ఎమ్మెల్యే ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
అనంతరం జన్మదిన కేక్ కట్ చేసి అందరికీ పంచుతూ సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి వినూత్న సంక్షేమ పథకాలతో ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచారన్నారు.
అలాగే సమితి వ్యవస్థను రద్దుచేసి మండలాలను ఏర్పాటు చేశారన్నారు. దీనితోపాటు బ్రిటిష్ కాలం నాటి తాసిల్దారు వ్యవస్థను రద్దు చేసి మండల రెవెన్యూ వ్యవస్థను స్థాపించి ప్రజలకు పాలనను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్ కే దక్కిందన్నారు.
విఏఓ వ్యవస్థను తొలగించి వీఆర్వోలను నియమించారని, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్న ఎన్టీఆర్ వల్లే సాధ్యమైందని ఎమ్మెల్యే కొనియాడారు. దీనితోపాటు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు కే దక్కిందని ఎమ్మెల్యే ఆదిమూలం కీర్తించారు.
ఎన్టీఆర్ సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ రాణించారన్నారు. అంతటి మహోన్నత వ్యక్తి అడుగుజాడల్లో నేటి యువత నడవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్, టిడిపి నాయకులు ఆర్డీ ఏకాంబరం, ఇలంగోవన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.