శ్రావణ శుక్రవారం పలమనేరులో తొలిసారిగా టీటీడీ ఆధ్వర్యంలో మహాలక్ష్మి దీప పూజ
ఎమ్మెల్యే అమరనాథ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ అధికారులు
పలమనేరు, ఆగస్టు 07 ( గరుడ ధాత్రి )
శ్రావణ మాసంలోని పవిత్ర శుక్రవారం సందర్భంగా ఈ నెల 14వ తేదీన పలమనేరులో తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మహోన్నత ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డితో కలిసి టీటీడీ అధికారులు శుక్రవారం పరిశీలించారు.
సుమారు 2 వేల మంది మహిళలు పాల్గొనే ఈ విశిష్ట కార్యక్రమం నిర్వహణకు పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని అనువైన వేదికగా ఎంపిక చేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను శనివారం నుంచే ప్రారంభించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మహాలక్ష్మి దీప పూజ మహిళల ఆధ్యాత్మిక వికాసానికి, కుటుంబ సౌఖ్యానికి, ఐశ్వర్యాభివృద్ధికి ఎంతో విశిష్టమైనదని తెలిపారు. పలమనేరు పరిసర ప్రాంతాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించి ఆమె అనుగ్రహానికి పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్ ప్రత్యేక అధికారి మేడసాని మోహన్, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ సీపీఓ, ఈఈ మల్లికార్జున ప్రసాద్, డీఈ సరస్వతి, ఏఈలు కృష్ణమూర్తి, మౌళి, తిరుచానూరు ఆలయ అర్చకులు ఆర్యా స్వాములు, అలాగే టీడీపీ నాయకులు ఆర్వీ బాలాజీ, కుట్టీ, సోమశేఖర్ గౌడ్, నాగరాజు రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రమేష్, సుదర్శన్ బాలాజీ, సుబ్రహ్మణ్యం గణేష్, కిరణ్, బీఆర్‌సీ కుమార్, నాగరాజు, భాస్కర్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.