GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 10:31 pm Posted by : GURU SWAMY

ఆరు నెలలుగా బకాయి ఉన్న వేతనాలు వెంటనే చెల్లిరుయా ఆసుపత్రిలో పనిచేస్తున్న 12 మంది నర్సింగ్ ఆర్డర్లీలకు న్యాయం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు వినతి

తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో ఆప్కాస్ ద్వారా అవుట్‌సోర్సింగ్ విధానంలో నియమితులై పనిచేస్తున్న 12 మంది పురుష, మహిళా నర్సింగ్ ఆర్డర్లీలకు ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ నేడు సీఐటీయూ నాయకులు చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు వాడ గంగరాజు, రుయా ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) వర్కింగ్ ప్రెసిడెంట్ కె. వేణుగోపాల్, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ. నరసింహులు, ఎఫ్‌ఎన్‌వోలు, ఎమ్‌ఎన్‌వోలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తిరుపతి జిల్లా ఏర్పడిన అనంతరం కూడా చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆప్కాస్ ద్వారా నిర్వహించిన నియామక ప్రక్రియలో భాగంగా మహిళా నర్సింగ్ ఆర్డర్లీలకు 28-11-2025న, పురుష నర్సింగ్ ఆర్డర్లీల రెండవ విడతకు 22-12-2025న నియామక ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఆ ఉత్తర్వుల ఆధారంగా మొత్తం 12 మంది కార్మికులు విధుల్లో చేరి తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో గత ఆరు నెలలుగా నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా నియామక ఉత్తర్వులు జారీ చేసి విధుల్లో చేర్చుకున్నప్పటికీ, సంబంధిత కార్మికులను ఆప్కాస్ పరిధిలోకి పూర్తిస్థాయిలో తీసుకోకుండా వారి సేవలను మాత్రం వినియోగించుకుంటూ ఇప్పటి వరకు ఒక్క నెల వేతనం కూడా చెల్లించకపోవడం అత్యంత అన్యాయమన్నారు. మూడు నెలల క్రితమే ఈ సమస్యను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, “ఇంకా ఆప్కాస్ పరిధిలోకి తీసుకోలేదు” అనే కారణాన్ని చూపుతూ సమస్యను పరిష్కరించకుండా పెండింగ్‌లో ఉంచారని తెలిపారు.

ఒకవైపు చిత్తూరు జిల్లా కలెక్టర్ జారీ చేసిన నియామక ఉత్తర్వుల ఆధారంగా విధుల్లో చేరిన కార్మికుల చేత ప్రతిరోజూ పని చేయించుకుంటూ, మరోవైపు వారిని ఆప్కాస్ ఉద్యోగులుగా గుర్తించకుండా వేతనాలు చెల్లించకపోవడం కూటమి ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో వెల్లడిస్తోందన్నారు. ఉద్యోగ బాధ్యతలు అప్పగించి సేవలు పొందుతూ, వేతనాల విషయంలో మాత్రం బాధ్యత నుంచి తప్పించుకోవడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు.

ఆరు నెలలుగా వేతనాలు అందక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇంటి అద్దెలు చెల్లించలేక, పిల్లల విద్యా ఖర్చులు భరించలేక, నిత్యావసర అవసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రోగుల సేవలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికులను ఇటువంటి పరిస్థితిలో ఉంచడం తగదన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆప్కాస్ పరిధిలో పనిచేస్తున్న అనేక మంది కార్మికులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని, దీనికి ప్రభుత్వం తక్షణ పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకుని రుయా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఈ 12 మంది కార్మికులకు పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న కార్మికులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది.
వినతిపత్రాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని జిల్లాలలో ఆప్కాస్ ఉద్యోగులకు సంబంధించి తలెత్తడం జరిగిందని. సమస్య పరిష్కారానికి కొంత సమయం అవసరమని, సుమారు నెల రోజుల గడువు ఇవ్వాలని కోరారు. ఈ వ్యవధిలో సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎన్ ఓ ఎమ్ ఎన్ ఓ లు గాంధీ సురేష్ సుధీర్ శ్రీకాంత్ రెడ్డి ప్రసన్న స్టెల్లా తదితరులు పాల్గొన్నారు.