గరుడధాత్రి న్యూస్ :
నాగలాపురం మండలంలో ఆర్టీసీ బస్సుల కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఒక్క ఆర్టీసీ బస్సు కూడా రాకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు బస్టాండ్‌లో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.
చివరకు వచ్చిన బస్సులో ప్రయాణికులు ఒక్కసారిగా ఎక్కడంతో తీవ్ర రద్దీ నెలకొంది. సీట్లు దొరకకపోవడంతో పలువురు విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయం లేక ఇదే పరిస్థితి ఎదురవుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాలలు, కళాశాలలు ముగిసే సమయాల్లో అదనపు బస్సులు నడపాలని, నాగలాపురం ప్రాంతానికి తగిన సంఖ్యలో ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో ఉంచాలని ప్రయాణికులు, తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి బస్సుల కొరతను నివారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.