GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 9:01 am Digital Edition : GURU SWAMY

ఆర్టీసీ బస్ స్టాండ్‌లో చెత్తకు నిప్పు పెట్టిన ఆకతాయిలు -సత్వరమే స్పందించిన మునిసిపల్ కమిషనర్

పలమనేరు ఆగస్ట్ 01 ( గరుడ ధాత్రి ) :

పలమనేరు ఆర్టీసీ బస్సు స్టాండ్ ప్రాంగణంలో ఉన్న చెత్తకు కొందరు ఆకతాయిలు నిప్పు పెట్టడంతో తీవ్ర పొగ అలముకుంది. ఈ పొగ బస్సు స్టాండ్ తో పాటు సమీపంలోని మునిసిపల్ కార్యాలయ ప్రాంతాన్ని కమ్ముకోవడంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే మునిసిపల్ కమిషనర్ లోకేశ్వర వర్మ స్పందించి, హుటాహుటిన మంటలను అదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకున్నారు.ఈ సంఘటనపై శనివారం మునిసిపల్ కమిషనర్, ఆర్టీసీ డిపో మేనేజర్ అల్తాఫ్ బాషా, డిపో కంట్రోలర్ రమణ మరియు పురపాలక సంఘ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ…చెత్త నిర్వహణ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఇక్కడ చెత్త భారీగా పేరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రపరచాలని కాంట్రాక్టర్ మరియు సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఆర్టీసీ బస్సు స్టాండ్ నందు నిత్యం జనరద్దీ ఎక్కువగా ఉండే దృష్ట్యా, ప్రజారోగ్యాన్ని మరియు పరిసరాల పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌లు, ఫాగింగ్, మరియు స్ప్రేయింగ్ కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు.బస్సు స్టాండ్ ప్రాంగణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆర్టీసీ సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ సురేష్ బాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ బాబు రెడ్డి నాయక్ పురపాలక సంఘ మరియు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.