ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. అవసరమైతే అసెంబ్లీలో ప్రస్తావిస్తా: ఎమ్మెల్యే ఆదిమూలం
సత్యవేడు, అక్టోబరు 6 గరుడధాత్రి:
ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హామీ ఇచ్చారు. అవసరమైతే అసెంబ్లీ సమావేశాల్లోనూ వారి సమస్యలను ప్రస్తావిస్తానని తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మెలుగు రమేష్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు మంగళవారం ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా వర్కర్లుగా మార్చి సమాన వేతనం, సౌకర్యాలు కల్పించాలని కోరారు. వారాంతపు, జాతీయ, పండుగ సెలవులతో పాటు క్యాజువల్, మెడికల్ లీవులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. విధి నిర్వహణలో మృతి చెందిన ఆశా వర్కర్ల దహన సంస్కారాల ఖర్చులను ప్రభుత్వమే భరించాలని కోరారు.
ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచాలని, పీహెచ్‌సీలకు వెళ్లే ప్రతిసారీ టీఏ, డీఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం శిక్షణ పొందిన వారికి పర్మినెంట్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, రూ.10 లక్షల జీవిత బీమా కల్పించాలని కోరారు. నాణ్యమైన మొబైల్ ఫోన్లు, యూనిఫామ్‌లు అందించడంతో పాటు గ్రాట్యుటీ సీలింగ్‌ను ఎత్తివేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఆశా వర్కర్ల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే ఆదిమూలం హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఆశా వర్కర్ల జిల్లా కమిటీ సభ్యులు అనుగీత, సుమతి, మునిలక్ష్మి, రూతు, కోకిల, కస్తూరి, రాములమ్మ, సార్ల లావణ్యరాణి తదితరులు పాల్గొన్నారు.