GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 12:03 pm Digital Edition : GURU SWAMY

ఇసుక అక్రమ రవాణాపై మైనింగ్ అధికారుల మెరుపు దాడులు

22 ఇసుక ట్రాక్టర్లు సీజ్‌.. తమిళనాడుకు అక్రమ రవాణాపై కేసులు

నాగలాపురం, ఆగస్టు 13 (గరుడధాత్రి న్యూస్): నాగలాపురం మండలంలో ఇసుక అక్రమ రవాణాపై మైనింగ్ అధికారులు, పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. మండలంలోని నందనం ఇసుక రీచ్‌ పరిధిలో అరుణానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 22 ట్రాక్టర్లను తిరుపతి మైనింగ్ ఏడీ బాలాజీ నాయక్ సీజ్ చేశారు.
గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచే మైనింగ్ అధికారులు, పోలీసు సిబ్బంది హైవేపై కాపుకాసి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలపై నిఘా పెట్టారు. వీఆర్వోలు చంద్రశేఖర్, మహేశ్‌తో పాటు నాగలాపురం పోలీసు సిబ్బంది సహకారంతో పట్టుబడిన 22 ట్రాక్టర్లను నాగలాపురం ఏఎంసీకి తరలించారు.
అరుణానది నుంచి ఇసుకను అక్రమంగా తవ్వి, ఒకచోట పోగుచేసి అక్కడి నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు మైనింగ్ ఏడీ బాలాజీ నాయక్ తెలిపారు.
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.