GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 5:56 pm Digital Edition : GURU SWAMY

ఈ ఫలితాలు – మార్పునకు నాంది..! తమిళనాడులో టీవీకే గెలుపు కూటమికి రెడ్ సిగ్నల్ – ⁠విజేతలకు బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ అభినందనలు

దేశంలోని నాలుగు రాష్ట్రాల, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ఫలితాలు రాజకీయ మార్పునకు నాంది అని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు.. ప్రజలు విజ్ఞతతో ఓటేస్తారని, అధికారంలో ఉన్న పార్టీలు సక్రమంగా పని చేయకపోతే ప్రజలు తిరస్కరిస్తారనడానికి బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఫలితాలే నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు..

“తమిళనాడులో విజయ్ పార్టీ గెలవడం ఆంధ్రప్రదేశ్ లో కూడా మూడో ప్రత్యామ్నాయం దిశగా బీసీవై అడుగులకు స్ఫూర్తినిచ్చింది. దశాబ్దాల తరబడి రెండు పార్టీలే అధికారాన్ని పంచుకుంటాం.. దోచుకుంటాం.. దొంగచాటు రాజకీయాలు చేస్తామంటే ప్రజలు హర్షించరు.. మూడో ప్రత్యామ్నాయానికి కచ్చితంగా చోటు ఉంటుందన్నారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని రాజకీయ శక్తిగా.. మూడో ప్రత్యామ్నాయంగా బీసీవై పార్టీ ఎదుగుతుందని ఆయన ఉద్ఘాటించారు.. గతంలో పాలించిన వైసీపీ అరాచకాలకు విసిగిపోయిన ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టారు.. కానీ కూటమి కూడా అంతకు మించిన అరాచకాలు, అవినీతి వ్యవహారాలతో కూడా ప్రజలు విసిగిపోయారని ఆర్సీవై అభిప్రాయపడ్డారు.. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయం దిశగా.. తెలంగాణలో బలమైన రాజకీయ వ్యవస్థగా బీసీవై పార్టీ నిలదొక్కుకుంటుందని ఆయన పేర్కొన్నారు.. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు, విజేత పార్టీలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసారు..