GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 6:20 pm Posted by : GURU SWAMY

ఉద్యోగులపై వేధింపులు, అమర్యాదకర వైఖరిని అధికారులు మానుకోవాలి

-ఏపీఎన్జీజీఓ అధ్యక్షులు ఆనందబాబు హెచ్చరిక

పలమనేరు, జూన్ 20 ( గరుడ ధాత్రి ) :
ఇటీవల నియోజకవర్గ పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పట్ల కొంతమంది అధికారులు అనుసరిస్తున్న వైఖరిపై ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని ఏపీఎన్జీజీఓ సంఘం పలమనేరు అధ్యక్షులు ఆనందబాబు పేర్కొన్నారు. ఉద్యోగులను చులకనగా చూడడం, అమర్యాదకరంగా మాట్లాడడం, హేళన చేయడం మరియు బానిసల మాదిరిగా వ్యవహరించడం వంటి ఘటనలపై సంఘానికి అనేక ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, అధికారుల ఒత్తిడిని తీవ్రంగా ఖండించారు.
“జన గణన, వివిధ సర్వేలు, ఇన్‌ఛార్జ్ బాధ్యతలు, బీఎల్‌ఓ డ్యూటీలు వంటి శాఖేతర విధుల కేటాయింపులో అధికారుల మధ్య సరైన సమన్వయం కరువైంది. దీనివల్ల ఒకే ఉద్యోగికి అనేక బాధ్యతలు అప్పగిస్తూ పని భారాన్ని పెంచుతున్నారు. వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో వ్యవహరించకపోవడం వల్ల ఉద్యోగులకు శారీరక శ్రమ కంటే మానసిక క్షోభ ఎక్కువగా ఉంటోందన్నారు”. కొంతమంది స్థానిక అధికారులు పైఅధికారుల మెప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, ఉద్యోగులకు అసాధ్యమైన లక్ష్యాలను (టార్గెట్స్) నిర్దేశిస్తున్నారని ఆనందబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయ సమయం ముగిసిన తర్వాత, రాత్రి వేళల్లో కూడా ఉద్యోగులకు ఫోన్‌లు చేసి ఒత్తిడి చేయడం, బెదిరించడం, అమర్యాదకరంగా మాట్లాడడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగులు ఆకస్మిక మరణాల బారిన పడుతున్నా, ఉన్నతాధికారుల విధానాల్లో మార్పు రాకపోవడం విచారకరమన్నారు. మితిమీరిన పని ఒత్తిడి, మానసిక వేధింపులు, అధిక పర్యవేక్షణ వంటి అంశాలు ఉద్యోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఉద్యోగులు ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తారని, అయితే వేధింపులు, ఒత్తిడులతో కూడిన పని సంస్కృతి కొనసాగితే ఆశించిన ఫలితాలు రావని ఆయన గత చరిత్రను గుర్తు చేస్తూ హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు సానుకూల దృక్పథంతో స్పందించి, గౌరవప్రదమైన కార్యాలయ వాతావరణాన్ని నెలకొల్పాలని, సముచితమైన పని విభజన చేపట్టాలని కోరారు.
లేనిపక్షంలో ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నియోజకవర్గ పరిధిలో ఏ ఉద్యోగి పైనైనా వేధింపులు జరిగితే ఏపీఎన్జీజీఓ సంఘం చూస్తూ ఊరుకోదని, బాధితులకు అండగా నిలిచి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలో, ఉద్యోగులు కూడా తమ కర్తవ్య నిర్వహణలో ఎక్కడా అలసత్వం చూపకుండా, రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.