GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 9:17 am Digital Edition : GURU SWAMY

ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయం

పిచ్చాటూరులో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

పిచ్చాటూరు, సెప్టెంబర్ 5 గరుడధాత్రి:
విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయుల సేవలను స్మరించుకుంటూ పిచ్చాటూరు మండలంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలకు మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కార్యక్రమానికి మండల విద్యాశాఖాధికారి కె. హేమమాలిని, మండల ఇంచార్జ్ ఎంఈఓ ఏ. బాబయ్య, ఎంఈఓ 2-యుగంధర్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మండల విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న 13 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. వారికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేసి వారి సేవలను అభినందించారు.
ఉపాధ్యాయుల్లో ఉత్సాహాన్ని పెంపొందించేలా నిర్వహించిన వివిధ క్రీడా, పాటల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు ఉత్సాహంగా క్రీడా పోటీల్లో పాల్గొనడంతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది.
ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. మంచి సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయుల సేవలు ఎంతో అవసరమని, వారి సేవలను గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులందరూ ఐకమత్యంతో, అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు మునుస్వామి, వెంకటరమణ, షణ్ముగం, సుధాకర్, కుప్పరాజు మునిరత్నంతో పాటు మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.