ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఆర్టీసి ఉద్యోగులు
-డిపో గేట్ వద్ద ధర్నా నిర్వహణ
గరుడధాత్రి న్యూస్ :
ఏపి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 16, 17 తేదీలలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం డిపో అధ్యక్షుడు ఎం. నాగరాజు ఆధ్వర్యంలో డిపో గేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిపో అధ్యక్షుడు మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ద్వారానే నడపాలని, ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, శ్రీ శక్తి పథకం వల్ల ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, డీఏ మరియు పీఆర్సీ బకాయిలు చెల్లించి ఐఆర్ ప్రకటించి పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డిపో కోశాధికారి కార్తీక్, పబ్లిసిటీ కార్యదర్శి శ్రీనివాసులు, మహిళా అధ్యక్షురాలు సరిత, గ్యారేజ్ అధ్యక్షుడు మునుస్వామి, సీనియర్ నాయకులు చంద్రయ్య, ఎం.వి.కె రెడ్డి, డి.జి శేఖర్, మురళి తదితరులు పాల్గొన్నారు.