GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 5:29 pm Posted by : GURU SWAMY

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నిజమైన ఓటర్ల పేర్లు తొలగించవద్దు సీపీఎం నాయకులు తిరుపతి ఆర్డీవోకు వినతిపత్రం

తిరుపతి, జూన్ 20:
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించి, అర్హులైన ఓటర్ల పేర్లు అన్యాయంగా తొలగించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీజిల్లా కమిటీ సభ్యులు ఎస్ జయ చంద్ర, తిరుపతి రూరల్ కార్యదర్శి కే సుమన్ నాయకులు చిన్నబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైన రాజ్యాంగబద్ధమైన హక్కు అని పేర్కొన్నారు. ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడం ఎన్నికల యంత్రాంగం ప్రధాన బాధ్యత అని అన్నారు. అయితే గతంలో జరిగిన ఓటరు జాబితాల సవరణల్లో అనేక ప్రాంతాల్లో నిజమైన ఓటర్ల పేర్లు తొలగించబడిన సంఘటనలు చోటుచేసుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో కూడా ప్రజలకు సరైన సమాచారం అందకపోవడం, క్షేత్రస్థాయిలో సరైన పరిశీలన లేకపోవడం వల్ల పేదలు, కార్మికులు, వృద్ధులు, అట్టడుగు వర్గాల ప్రజల పేర్లు తొలగించే ప్రమాదం ఉందని తెలిపారు. అలాంటి పరిస్థితులు రాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
ఓటరు జాబితాల సవరణలో పూర్తి పారదర్శకత పాటించాలని, పేర్లు తొలగించే ముందు సంబంధిత వ్యక్తులకు తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాలని, వారి వివరణలు స్వీకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను సులభతరం చేసి యువత, మహిళలు, వలస కార్మికులు తదితర అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటరు నమోదు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల నుండి వచ్చే అభ్యంతరాలు, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం పెంచే విధంగా అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని సూచించారు.
అభినందనలతో
కే సుమన్…..
తిరుపతి రూరల్ కార్యదర్శి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు