-నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పన…
-నైపుణ్యాభివృద్ధిపై యువత దృష్టి పెట్టాలి : ప్రిన్సిపాల్ ఎ. ఉషా
తిరుపతి, జూన్ 17:
స్థానిక న్యూ బాలాజీ కాలనీలోని ఎస్‌డీహెచ్‌ఆర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. ఈ జాబ్ మేళాలో వివిధ ప్రముఖ సంస్థలు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించగా, మొత్తం 271 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డీవీఎస్ చక్రవర్తి రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత తమ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకుంటూ అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్ అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు కోసం కళాశాల యాజమాన్యం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.కళాశాల ప్రిన్సిపాల్ ఎ.ఉషా మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులను అభినందిస్తూ,ఈసారి ఎంపిక కాని వారు నిరుత్సాహపడకుండా తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుని పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో యువత హాజరై వివిధ సంస్థల ప్రతినిధులతో ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.జాబ్ మేళా విజయవంతానికి సహకరించిన సంస్థల ప్రతినిధులు, అధ్యాపకులు, సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు, పాల్గొన్న అభ్యర్థులకు కళాశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేసింది.