గరుడ దాత్రి న్యూస్ కడప,జులై 29జూలై 29:
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని, ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఇంచార్జ్ డిఆర్వో వెంకటపతి పిలుపునిచ్చారు.
బుధవారం కలెక్టరేట్‌లో లోని తన ఛాంబర్ లో నిర్వహించిన సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఓటరు జాబితాల సవరణ పురోగతి, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, నమోదు పత్రాల పంపిణీ, డిజిటలీకరణ, అనుమానాస్పద ఓటర్ల పునఃధ్రువీకరణ తదితర అంశాలపై డిఆర్వో సమగ్రంగా సమీక్షించారు.
సమావేశంలో ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ను వివరించిన డిఆర్వో.. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణ, అనంతరం వాటి పరిశీలన పూర్తిచేసి అక్టోబర్ 3న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో పేరు ఉండేలా, అనర్హుల పేర్లు తొలగించేలా అధికారులు క్షేత్రస్థాయిలో కట్టుదిట్టంగా పనిచేస్తున్నారని చెప్పారు.
జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల మ్యాపింగ్, నమోదు పత్రాల పంపిణీ, డిజిటలీకరణ పనుల పురోగతిని వివరించారు. జిల్లాలో 18,96,231 మంది ఓటర్లకు నమోదు పత్రాల పంపిణీ వంద శాతం పూర్తయిందని, డిజిటలీకరణ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోందని వెల్లడించారు.
అలాగే మరణించినవారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఓటరుగా నమోదైనవారు, ఇంటి వద్ద లేని ఓటర్లు తదితర అంశాలపై చేపట్టిన పునఃధ్రువీకరణ చర్యలను వివరించారు. మ్యాపింగ్ కాని ఓటర్లు, అసాధారణ నమోదుల గుర్తింపు, వాటి పరిష్కారానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా తమకు తెలిసిన సమాచారం అధికారులకు అందించి ఓటరు జాబితాలను మరింత కచ్చితంగా రూపొందించేందుకు సహకరించాలని కోరారు.
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా అవసరమైన చోట కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, మార్పులు, నామకరణ సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలు ఎన్నికల సంఘానికి పంపించామని, ఆ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగేలా రాజకీయ పార్టీలందరూ సమన్వయంతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు డా. బి. శ్రీనివాసులు AAP, ఎస్. గురప్ప BSP, జి.ఎస్.టి. లక్ష్మణరావు BJPజి. చంద్రశేఖర్ సీపీఐ ఎం బి. పాల్ సుధాకర్ INC పి. విశ్వనాథ్ – జనసేన పార్టీవైఎస్ జబీవుల్లా (TDP), పి. సునీల్ కుమార్ YSRCP తదితరులు పాల్గొన్నారు.