పలమనేరు, అక్టోబర్ 08 ( గరుడ ధాత్రి ) : స్థానిక ఎస్.వి.సి.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మహా ఉచిత రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాలలోని ఎన్సీసీ,ఎన్ఎస్ఎస్ , డబ్ల్యు డబ్ల్యు ఈసీ, వై ఆర్ సి , జిఆర్ఆర్సి , ఐక్యూఏసీ విభాగాలతో పాటు కుప్పం యూపీఎస్ సోజూర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. వెంకటేశులు అధ్యక్షతన జరిగిన ఈ శిబిరంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రక్తదానం చేయడం ఒక మహోన్నతమైన సేవ అని, దీని ద్వారా ఎంతోమంది ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడిన వారవుతారని తెలిపారు. యువత రక్తదానంపై అవగాహన పెంచుకుని, సామాజిక బాధ్యతగా స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నందీశ్వరయ్య స్వయంగా రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అనంతరం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ వెంకటేష్ బాబు, ఎన్సీసీ కోఆర్డినేటర్ డాక్టర్ వి. సింగరత్నం రెడ్డి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ బెనహర్, డబ్ల్యూఈసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. సంధ్యారాణి తదితరులు రక్తదానం ఆవశ్యకతను, దాని వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు సవివరంగా తెలియజేశారు. ఈ రక్తదాన శిబిరంలో మొత్తం 52 మంది విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. సమాజ సేవకై ముందుకొచ్చిన రక్తదాతలను, కార్యక్రమ నిర్వాహకులను పలువురు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.