GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 3:55 pm Posted by : GARUDA DHATRI NEWS

ఓటరు జాబితా సవరణపై టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం

-SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూరపాటి శంకర్ రెడ్డి పిలుపు

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (SIR)ను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా అర్హులైన ప్రతి ఓటరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు SIR ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు వరదయ్యపాలెంలోని KBG కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు.
నియోజకవర్గంలోని ఏడు మండలాల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓటరు జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు తదితర అంశాలపై అబ్జర్వర్ మలిశెట్టి వెంకటేశ్వర్లు సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రక్రియపై పార్టీ శ్రేణులు పూర్తి అవగాహన కలిగి ప్రజలకు సహకరించాలని సూచించారు.
క్లస్టర్ ఇన్‌చార్జీలు, కో-క్లస్టర్ ఇన్‌చార్జీలు, యూనిట్ ఇన్‌చార్జీలు, కో-యూనిట్ ఇన్‌చార్జీలు, ఐటీడీపీ ప్రతినిధులు, క్లస్టర్ టెక్నికల్ ఇన్‌చార్జీలు SIR ప్రక్రియను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, అర్హులైన ఓటర్ల వివరాలు నమోదు అయ్యేలా కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.