పలమనేరు, సెప్టెంబర్ 04 ( గరుడ ధాత్రి ) :
పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలతో పాటు, నూతన ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారికి పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అభిషేకానంతరం స్వామి, అమ్మవార్లను కమనీయమైన బంగారు కవచాలతో అలంకరించారు. సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది మహా మంగళహారతులు సమర్పించారు. ఉత్సవమూర్తులు కొలువుదీరేందుకు నూతనంగా నిర్మించిన ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం శాస్త్రోక్తంగా దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పలమనేరు పట్టణ హిందూ బంధువులు, విశేష సంఖ్యలో శ్రీకృష్ణ భక్తులు, ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.