GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 6:48 pm Digital Edition : GURU SWAMY

కలసి ప్రయాణిద్దాం- నవ్యాంధ్ర చరిత్ర సృష్టిద్దాం

* ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్.
* విజయవాడ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి సదస్సులో ప్రసంగించిన మంత్రి నారా లోకేష్.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 03 (గరుడ ధాత్రి న్యూస్):మనం కలిసి పనిచేస్తూ చరిత్ర సృష్టించాలని, ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శ మోడల్గా నిలవాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరుగుతున్న పాన్ ఐఐటి అమరావతి సమితిలో మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. అమరావతిలో ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ నార్మన్ ఫాస్టర్ రూపొందిస్తున్న అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాల నిర్మాణంతో పాటు ఆధునిక నగరం రూపుదిద్దుకుంటోందని తెలిపారు. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రతి 100 రోజులకు ఒకసారి అమరావతిలో స్పష్టమైన మార్పు, అభివృద్ధి కనిపిస్తోందని చెప్పారు. రికార్డు వేగంతో సాగుతున్న ఈ నగర నిర్మాణ పనులను పరిశీలించేందుకు అమరావతిని సందర్శించాలని కోరారు. భారతీయ ప్రమాణాలతో దేశం గర్వించే స్థాయి రాజధానిని నిర్మిస్తున్నట్లు వివరించారు.భారతదేశంలో మునుపెన్నడూ చూడని అభివృద్ధి, సుపరిపాలన అందించడమే తమ లక్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రధాని మోదీ ‘వికసిత్ భారత్’ ఆశయానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశు నంబర్ వన్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అనుభవజ్ఞుడైన సీఎం చంద్రబాబు నాయుడి ‘సాఫ్ట్వేర్’కి, 17 మంది కొత్త మంత్రులతో కూడిన యువ ‘హార్డ్వేర్’ టీమ్ తోడైందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది ఐఐటీ పూర్వ విద్యార్థులంతా ఏపీలో సమావేశం కావడం అభినందనీయమని, రాష్ట్ర పురోగతికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఆంధ్రప్రదేశ్లోని 23 క్లస్టర్ల అభివృద్ధికి ఐఐటీ పూర్వ విద్యార్థులు తమ అనుభవాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. సాంకేతికత, వ్యవసాయం, క్వాంటం వంటి రంగాలలో రాణించిన మేధావులు రాష్ట్ర అభివృద్ధికి భాగస్వాములు కావాలని కోరారు. ‘విజిబుల్ గవర్నెన్స్ – ఇన్విజిబుల్ గవర్నమెంట్’ సూత్రంతో ఏఐ యుగంలో వ్యవస్థీకృత పాలన అందిస్తున్నామని తెలిపారు. జుగాడ్ నమూనా నుంచి స్థిరమైన ‘ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్పీడ్’ వైపు సాగుతున్నామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా ఏపీని ‘ఐలాండ్ ఆఫ్ ఎక్సలెన్స్’గా తీర్చిదిద్ది దేశానికే ఆదర్శంగా నిలుపుతామని పేర్కొన్నారు.రాజధాని అమరావతి అభివృద్ధికి కీలకంగా ఉండేలా 5,000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. హైదరాబాద్కు ఎయిర్పోర్ట్ ఎంతటి మైలురాయిగా నిలిచిందో, అమరావతికి ఈ విమానాశ్రయం అంతే ప్రధాన ఆకర్షణగా మారుతుందని చెప్పారు. అలాగే అమరావతిని ఎడ్యుకేషన్, రీసెర్చ్, క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దుతున్నామని, ఇప్పటికే బిట్స్ వంటి 6 ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఇక్కడ కొలువుదీరాయని పేర్కొన్నారు. నిపుణుల మార్గదర్శకత్వంతో వచ్చే దశాబ్దంలో ఆంధ్రప్రదేశు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.ఒప్పందాలకే పరిమితం కాకుండా ప్రాజెక్టుల వాస్తవ అమలే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ మేరకు రాయలసీమను ప్రపంచ హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు మదనపల్లిలో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా హార్టికల్చర్ ఎకోసిస్టమ్లో సుమారు రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు సాధించడంతో పాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యమని తెలిపారు. అలాగే, ఇతర రాష్ట్రాల్లో దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న ఆర్సెలర్ మిట్టల్ 17 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ పనులను, కేవలం 17 నెలల వ్యవధిలోనే పర్యావరణ అనుమతులతో సహా సాధించి శంకుస్థాపన దశకు తీసుకువచ్చామని పేర్కొన్నారు.అభివృద్ధి సాధించడానికి అమెరికా, యూరప్లకు 100 ఏళ్లు, దుబాయికి 30 ఏళ్లు, సింగపూర్కు 25 ఏళ్లు పడితే, భారత్కి ఒక దశాబ్దం సమయం సరిపోతుందని, ఆ ‘గోల్డెన్ డికేడ్’ మనదే కావాలని లోకేష్ ఆకాంక్షించారు. ఈ వృద్ధికి ‘స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ’ అనే త్రీ “ఎస్” మంత్రమే ఆధారమని స్పష్టం చేశారు. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, ప్రాజెక్టుల ద్వారా ఉద్యోగాలు సృష్టించడమే తమ నమూనా అని పేర్కొన్నారు. పరిశ్రమల నిర్వాహకులను ‘జాతి నిర్మాణకర్తలు’గా అభివర్ణించిన ఆయన, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ప్రముఖ ప్రాజెక్టుల పురోగతిపై శని, ఆదివారాల్లో వ్యక్తిగతంగా తానే పరిశ్రమల ప్రతినిధులకు ఆప్డేట్స్ పంపుతూ ప్రపంచస్థాయి సేవలు అందిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ విధానాలు, ఉత్తర్వులు చట్టపరమైన సవాళ్లను తట్టుకునేలా రూపొందించేందుకు ఐఏఎస్ అధికారులకు ఏఐ ద్వారా దిశానిర్దేశం చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 16 వేల ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో గతంలో కోర్టు కేసులు ఎదుర్కొన్న ఉత్తర్వులను ఏఐ ఇంజిన్ ద్వారా విశ్లేషించి, ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు లేని అత్యుత్తమ రిక్రూట్మెంట్ పాలసీని రూపొందించినట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి క్వాంటం టెక్నాలజీ ఎంత ముఖ్యమో వ్యవసాయ, ఉద్యానవన రంగాలు కూడా అంతే కీలకమని వెల్లడించారు. పెట్టుబడిదారులకు, ప్రజలకు స్థిరమైన పాలనను అందించడంలో తమ ప్రభుత్వం ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.భారత్ అభివృద్ధి చెందడానికి ఒక దశాబ్ద కాలం సరిపోతుందని, ఆ ‘గోల్డెన్ డికేడ్’ సాధనకు స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ మంత్రమే ఆధారమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజలిచ్చిన 5 ఏళ్లలోనే ఫలితాలు చూపించేలా వేగంగా పనిచేస్తున్నామని, కేవలం ఎం ఓ యు లతో ఆగక ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రాజెక్టులకు వాస్తవ రూపమిస్తున్నామని చెప్పారు. పారిశ్రామికవేత్తలను ‘జాతి నిర్మాణకర్తలు’గా భావిస్తూ ప్రమోటర్లకు వ్యక్తిగతంగా అప్డేట్స్ ఇస్తూ ప్రపంచ స్థాయి సేవలు అందిస్తున్నామని తెలిపారు. రాజకీయ మార్పులకు అతీతంగా నిలిచే స్థిరమైన విధానాలతో (స్టెబిలిటీ) రాష్ట్రాన్ని వేగవంతమైన ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.