* బీసీఎన్ విద్యా సంస్థల అధినేత డా. బి.సి. నాగరాజ్.
కుప్పం,జులై 27 (గరుడ ధాత్రి న్యూస్): అబ్దుల్ కలాం ఆశయాలే యువతకు విజయమార్గమని బీసీఎన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ బి.సి. నాగరాజ్ అన్నారు.
కుప్పం ఇంజనీరింగ్ కళాశాల జాతీయ సేవా పథకం విభాగం ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బి సి ఎన్. విద్యాసంస్థల అధినేత డా. బి.సి. నాగరాజ్ అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్ధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, డా అబ్దుల్ కలం కుప్పం ఇంజనీరింగ్ కాలేజీ ను 7-6-2003 లో సందర్శించి విద్యార్థులతో వివిధ అంశాలపై చర్చిండం మరిచి పోలేని అనుభవమని గుర్తుచేశారు. “కలలు కనడం మాత్రమే కాదు, వాటిని సాకారం చేసుకునే దిశగా నిరంతరం శ్రమించడం నేర్పిన మహనీయుడు డా. ఏపీజే అబ్దుల్ కలాం” అని పేర్కొన్నారు. ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రచయితగా, గొప్ప వక్తగా విశిష్ట సేవలందించిన డా. కలాం భారతదేశ 11వ రాష్ట్రపతిగా దేశానికి అపూర్వ సేవలందించారని, ప్రజల హృదయాల్లో ప్రజల రాష్ట్రపతిగా చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు.
ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు విద్యార్థులే దేశ భవిష్యత్తు అనే గొప్ప నమ్మకంతో జీవించిన డా. కలాం ముందుగా ఒక ఆదర్శ ఉపాధ్యాయుడని కొనియాడారు. తమిళనాడులోని రామేశ్వరం నుంచి సాధారణ కుటుంబంలో జన్మించి, తన కృషి, క్రమశిక్షణ, పట్టుదలతో దేశ అత్యున్నత పదవిని అలంకరించిన ఆయన జీవితం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.డా. కలాం యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన దార్శనికుడని, శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా దాటిన మహనీయుడని అన్నారు. విద్యార్థులు ఆయన ఆశయాలను, విలువలను, క్రమశిక్షణను ఆదర్శంగా తీసుకొని విజ్ఞానంతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమములో వైస్ ప్రిన్సిపాల్ డా.ఎస్. భాస్కరన్, ఆర్ అండ్ డి విభాగాధిపతి డా. జి. ఎన్.. కోదండరామయ్య, హ్యూమానిటీస్ అండ్ సైన్సెస్ విభాగాధిపతి జె. మాధవన్, గ్రంథాలయ విభాగాధిపతి డా. సి.జి. శరవణ, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గంగాధరన్, కోఆర్డినేటర్ డా. అరుణ్ కుమార్, వివిధ విభాగాధిపతులు, పీఆర్వో ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలింటర్స్ పాల్గొన్నారు.