GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 8:20 pm Posted by : GURU SWAMY

కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలి

సిఐటియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

పలమనేరు, జులై 29 ( గరుడ ధాత్రి ) :

కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని మరియు కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు,రేపు జిల్లా కలెక్టరేట్ ల వద్ద నిర్వహించనున్న ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ స్థానిక ఎంపీడీవో ఆఫీస్ నుండి సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా మాట్లాడుతూ… కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ మరియు ఆప్కాబ్ లలో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కనీస వేతనాలు అమలు జరుగుతున్నాయని, కానీ మన రాష్ట్రంలో 15 సంవత్సరాలుగా కనీస వేతనాలు సవరించకపోవడం విచారకరమని అన్నారు.
కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులందరినీ తక్షణమే రెగ్యులర్ చేయాలన్నారు.
కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపజేయాలన్నారు.
పనివేళల్లో ప్రమాదం జరిగితే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కార్మికులకు నష్టం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి, పాత విధానాన్ని పునరుద్ధరించాలన్నారు.
ర్యాలీలో పాల్గొన్న ఎల్.ఐ.సి జిల్లా కార్యదర్శి మునిరాజులు, అధ్యక్షులు గౌరీ శంకర్ మాట్లాడుతూ… స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, వెలుగు, సమగ్ర శిక్షా, నేషనల్ హెల్త్ మిషన్, ఉపాధి హామీ, 108, 104, ఆరోగ్య మిత్ర ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారి వేతనాలు పెంచాలని కోరారు.నేడు,
రేపు (జూలై 30, 31 తేదీలలో) కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజా, జయంతి, ధనమ్మ, సుధాకర్, ప్రజా నాట్యమండలి చిత్తూరు జిల్లా కార్యదర్శి ప్రతాప్ తదితర నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.