GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 6:41 pm Digital Edition : GURU SWAMY

కార్వేటినగరం టీటీడీ కల్యాణ మండపం కంచి మఠానికి ఇవ్వొద్దు

కంచి మఠం అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు..
గందరగోళ పరిస్థితుల్లో వెనుదిరిగిన కంచి మఠం అధికారులు: కార్వేటి నగరం అక్టోబర్ 3 గరుడదాద్రి న్యూస్. కార్వేటినగరం లో ఉన్న రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి ఆలయం వద్ద టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కల్యాణ మండపాన్ని కంచి మఠానికి అప్పగించడంపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీటీడీ జేఈవో నుంచి లేఖ వచ్చినట్లు సమాచారం తెలుసుకున్న కంచి మఠానికి చెందిన అధికారులు కల్యాణ మండపాన్ని పరిశీలించేందుకు అక్కడికి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న కార్వేటినగరం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని కంచి మఠం అధికారులను అడ్డుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కల్యాణ మండపాన్ని ఏ ప్రాతిపదికన కంచి మఠానికి అప్పగిస్తారని వారు ప్రశ్నించారు.
స్థానిక ప్రజలకు ఉపయోగపడుతున్న కల్యాణ మండపంపై ముందుగా గ్రామస్తులకు సమాచారం ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవడం ఏమిటని వారు నిలదీశారు. దీనిపై అక్కడ కొంతసేపు ఉద్రిక్తత, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి తీవ్రతరం కావడంతో కంచి మఠానికి చెందిన అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగినట్లు గ్రామస్తులు తెలిపారు.
టీటీడీ అధికారులు స్పష్టత ఇవ్వాలి
కల్యాణ మండపాన్ని కంచి మఠానికి అప్పగించే విషయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. టీటీడీ ఆధ్వర్యంలోనే కల్యాణ మండపాన్ని కొనసాగించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు లతా బాలాజీ శేషాద్రి రాజేందర్రెడ్డి రవి యాదవ్ యువరాజు సుబ్రహ్మణ్యం రవికుమార్ కంచి మఠం చెందిన లక్ష్మీ అప్పారావు గ్రామస్తులు పాల్గొన్నారు.