* వ్యూహాలకు పదును పెడుతున్న రాజకీయ పార్టీలు.
* మొదలైన రాజకీయ పార్టీల సమావేశాలు.
* సమావేశాల్లో గెలుపు గుర్రాలను పసిగడుతున్న నేతలు.
కుప్పం,సెప్టెంబర్ 15 (గరుడ ధాత్రి న్యూస్): రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల వేడి రాచుకుంది. కుప్పం నియోజకవర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గానికి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరో రెండు నెలల లోపు స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. తదనగుణంగా అధికారులు సైతం స్థానిక ఎన్నికలకు సమాయాత్తమవుతున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. కుప్పం నియోజకవర్గంలో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పిటిసి, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్ స్థానాలను దక్కించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. దీనికోసం అభ్యర్థులను గుర్తించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు సమన్వయ కమిటీ సమావేశాలను నిర్వహిస్తున్నారు. మరో పక్కన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో అన్ని స్థానాలను దక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టుదలతో ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. అన్ని స్థానాలలో తమ అభ్యర్థులను పోటీలో దించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గ పరిధిలోని పార్టీ మండల కమిటీలు ,మండల స్థాయి సమన్వయ కమిటీలు, పార్టీ ప్రధాన నాయకుల ఆధ్వర్యంలో వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఆయా పంచాయతీలలో తెలుగుదేశం పార్టీ పంచాయితీ సమన్వయ కమిటీ సమావేశాలను నిర్వహిస్తూ ఎక్కడైనా సమన్వయ లోపం ఉంటే నేతల మధ్య సమన్వయం తీసుకువస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో రెండేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటా వివరించి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని స్థానిక తెలుగుదేశం పార్టీ యంత్రాంగం ముందుకు పోతోంది. కుప్పం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్. మునిరత్నం సమన్వయం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా కుప్పం నియోజకవర్గాన్ని పార్టీ పరంగా క్లస్టర్లుగా విభజించారు. ప్రతి క్లస్టర్ కు ఒక క్లస్టర్ ఇన్చార్జిని నియమించారు. పంచాయతీ వార్డులకు పార్టీ కమిటీలను నియమించారు. బూత్ కమిటీలను నియమించారు.ఈ అన్ని కమిటీల సమన్వయంతో స్థానిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలను గుర్తించే ప్రక్రియను తెలుగుదేశం పార్టీ చేపడుతోంది. మరో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలు అభ్యర్థులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. దీంతో స్థానిక ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతోంది.