-బసవ తారకం ఆస్పత్రి ఏర్పాటుతో పేదలకు అందుబాటులోకి వచ్చిన ఖరీదైన క్యాన్సర్ చికిత్స
-25 ఏళ్లలో దేశంలోనే పేరొందిన 650 పడకల సమగ్ర క్యాన్సర్ ఆస్పత్రిగా సేవలు
-ఏడాదికి 3 లక్షల మంది అవుట్ పేషెంట్లు, 90 వేలమంది ఇన్ పేషెంట్లకు సేవలు
-పవిత్ర యజ్ఞంగా బసవతారకం ఆస్పత్రిని నిర్వహిస్తున్న బాలకృష్ణ
-25 ఏళ్లుగా నిరంతరం సేవలందిస్తోన్న బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
-హైదరాబాద్ లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
-సోమవారం రజతోత్సవాలకు హాజరు కానున్న సీఎం చంద్రబాబు
గరుడధాత్రి :
క్యాన్సర్ చికిత్సను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ప్రారంభమైన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న వారి జీవితాలు మధ్యలోనే ముగిసిపోకూడదన్న ఆలోచనతో బసవతారకం పేరుతో క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో రూపుదిద్దుకుంది ఈ సంస్థ. ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్య సేవలను తక్కువ ఖర్చుతో, లాభాపేక్ష లేకుండా అందించాలన్న లక్ష్యంతో దివంగత నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో 1988లో ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. వైద్య రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రవాస భారతీయులు, దాతల సహకారంతో ట్రస్ట్ ఏర్పాటుకు పునాదులు పడగా, 2000 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా 100 పడకలతో ఆస్పత్రి ప్రారంభమైంది. అనంతరం సేవల విస్తరణకు అనుగుణంగా దశలవారీగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం 650 పడకల సామర్థ్యంతో దేశంలోనే ప్రముఖ సమగ్ర క్యాన్సర్ చికిత్స, పరిశోధనా కేంద్రంగా ఎదిగింది.
-పేదల ఆస్పత్రి బసవ తారకం
గత పాతికేళ్లుగా సేవాభావం, మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందిస్తూ బసవతారకం ఆస్పత్రి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది రోగులు బసవ తారకం ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ప్రతేడాది 3 లక్షల మందికి పైగా అవుట్‌పేషెంట్లు, సుమారు 90 వేల మంది ఇన్‌పేషెంట్లకు ఆస్పత్రి సేవలందిస్తోంది. ఇప్పటివరకు 8 వేలకుపైగా క్యాన్సర్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించగా, 86 బోన్ మ్యారో మార్పిడి చికిత్సలు నిర్వహించారు. క్యాన్సర్ చికిత్స కోసం ఆస్పత్రిని ఆశ్రయించే వారిలో 65 శాతం మందికిపైగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. తక్కువ వ్యయంతో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించడం వల్ల పేదల ఆస్పత్రిగా బసవతారకం పేరు పొందింది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్–పీఎం జే (PM-JAY)తో పాటు ఇతర ప్రభుత్వ ఆరోగ్య పథకాల పరిధిలోని లబ్ధిదారులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోంది. అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడంలో ఆస్పత్రి ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. ప్రస్తుతం సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాలతో పాటు రేడియాలజీ, పాథాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, మెడికల్ ఫిజిక్స్, పరిశోధన మరియు అభివృద్ధి విభాగాల్లో నైపుణ్యం కలిగిన వైద్యులు, సాంకేతిక నిపుణులు సేవలందిస్తున్నారు. సర్జికల్, మెడికల్, రేడియేషన్ ఆంకాలజీ రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన సుమారు 250 మంది వైద్యులు, వైద్య సిబ్బంది రోగులకు సేవలందిస్తున్నారు.
-స్క్రీనింగ్ బస్ ద్వారా గ్రామాల్లో క్యాన్సర్ బాధితులకు సేవలు
తల, మెడ, రొమ్ము, సర్వికల్, ప్రొస్టేట్ క్యాన్సర్లతో పాటు వివిధ అవయవాలకు సంబంధించిన క్యాన్సర్లకు సమగ్ర చికిత్సలను ఈ ఆస్పత్రిలో అందిస్తున్నారు. క్యాన్సర్ బాధితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నొప్పి నివారణ, సంపూర్ణ సంరక్షణకు సేవలు అందించే ప్రత్యేక పాలియేటివ్ కేర్ యూనిట్‌ను ఆస్పత్రి నిర్వహిస్తోంది. చికిత్సతో పాటు బాధితులు, వారి కుటుంబ సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే చర్యలను చేపడుతోంది. క్యాన్సర్ నివారణకు ముందస్తు గుర్తింపు, విస్తృత స్థాయి స్క్రీనింగ్ కార్యక్రమాలు జాతీయ ప్రాధాన్యతగా మారాలన్న లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలను ఆస్పత్రి నిర్వహిస్తోంది. డిజిటల్ మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్‌రే సదుపాయాలు కలిగిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు ద్వారా వైద్య సేవలను ఆస్పత్రికే పరిమితం చేయకుండా గ్రామాలు, మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజల వద్దకే తీసుకెళ్తోంది. ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వైద్య సేవలతో పాటు మానవత్వం, కరుణ, సేవాభావాన్ని మేళవిస్తూ క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తున్న బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సేవా దృక్పథంతో కూడిన వైద్య రంగ సంస్థగా గుర్తింపు పొందింది. దాతృత్వం, వైద్య నిపుణుల ప్రతిభ, సమాజం వైపు నుంచి లభించే మద్దతు, ప్రభుత్వ ప్రజారోగ్య కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ క్యాన్సర్‌పై సమర్థవంతమైన పోరాటం చేయవచ్చని ఈ సంస్థ తన 25 ఏళ్ల ప్రస్థానంతో చాటిచెప్పింది. భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో సేవలను అందించాలన్న సంకల్పాన్ని పునరుద్ఘాటించేలా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవాలను నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం చివరి కోరిక మేరకు బసవ తారకం ఆస్పత్రిని నందమూరి తారక రామారావు మొదలు పెట్టగా… ఆయన వారసుడు.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆస్పత్రి నిర్వహణను పవిత్ర యజ్ఞంగా భావిస్తున్నారు. ఆస్పత్రి ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా బాలకృష్ణ ఆధ్వర్యంలో బసవతారకం ఆస్పత్రి పేదలకు మరిన్ని అత్యాధునిక సేవలను అందిస్తోంది. క్యాన్సర్ బాధితులకు అత్యాధునిక వైద్య సేవలను మానవత్వం, సేవాభావంతో అందిస్తూ దేశంలోనే గుర్తింపు పొందిన ఈ వైద్యసంస్థ రజతోత్సవ వేడుకలు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవోటెల్‌లో నిర్వహించనున్నారు. నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వైద్య నిపుణులు, దాతలు, ఆస్పత్రి సేవలతో అనుబంధం కలిగిన అతిథులు హాజరు కానున్నారు.