GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 4:34 pm Digital Edition : GURU SWAMY

గంజాయి నిర్మూలనకు కొత్త టెస్టింగ్ కిట్ – సత్యవేడు పరిసరాల్లో పూర్తిగా అరికడతాం : సిఐ మురళి నాయుడు

సత్యవేడు ప్రాంతంలో గంజాయి వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సత్యవేడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మురళి నాయుడుతెలిపారు. ఈ మేరకు ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
గంజాయి నియంత్రణ కోసం ప్రభుత్వం కొత్త టెస్టింగ్ కిట్‌ను ప్రవేశపెట్టిందని, ఈ కిట్ ద్వారా గత రెండు నెలల క్రితం గంజాయి సేవించినా గుర్తించవచ్చని తెలిపారు. ఈ కిట్ వినియోగంతో గంజాయి వినియోగాన్ని గుర్తించి అరికట్టడం సులభమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
సత్యవేడు మరియు చుట్టుపక్కల గ్రామాల్లో గంజాయి కలకలం గణనీయంగా తగ్గిందని, పూర్తిగా గంజాయి నిర్మూలన లక్ష్యంగా చర్యలు కొనసాగిస్తున్నామని సీఐ తెలిపారు. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గంజాయి, మద్యం మరియు ఇతర మాదకద్రవ్యాలను అరికట్టడం పోలీసుల బాధ్యతగా తీసుకున్నామని చెప్పారు.
గంజాయి వాడటం లేదా అమ్మటం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ఆడపిల్లలు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలని సీఐ సూచించారు. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపకుండా, అపరిచితులతో పరిచయాలు పెంచుకోవద్దని హెచ్చరించారు. కొంతమంది దుండగులు మాదకద్రవ్యాల మత్తులో ఆడపిల్లల జీవితాలను నాశనం చేసే ఘటనలు జరుగుతున్నాయని, అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండాలని కోరారు.
“చదువుపై దృష్టి పెట్టండి… మీ భవిష్యత్తును కాపాడుకోండి”*అని విద్యార్థులకు స్నేహపూర్వకంగా సూచించారు.ఈ మీడియా సమావేశంలో ఎస్‌ఐ సాయినాథ్ చౌదరి, ఎస్‌ఐ లావణ్య పాల్గొన్నారు.