GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 8:37 pm Posted by : GARUDA DHATRI NEWS

గంటావూరు కాలనీ అభివృద్ధికి బాధ్యత నాది-అన్ని సౌకర్యాలు కల్పిస్తాం :ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి

పలమనేరు, జూన్ 14 గరుడ ధాత్రి : పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటావూరు కాలనీ అభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత తనదేనని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాలనీలో రోడ్లు, వీధి దీపాలు, తాగునీటి సౌకర్యం సహా ప్రజలకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు.
తమ ప్రాంతంలో ఉన్న ఈద్గా ప్రాంగణానికి ప్రహరీ నిర్మాణం మంజూరు చేయాలని కోరుతూ గంటావూరు కాలనీకి చెందిన మైనారిటీ సోదరులు టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన ఎమ్మెల్యే, కాలనీలోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు.
“భవిష్యత్తులో ఈ సౌకర్యాలు కావాలని మళ్లీ అడిగే అవసరం లేకుండా గంటావూరు కాలనీని అభివృద్ధి చేయాలన్నదే నా లక్ష్యం. ప్రజలకు అవసరమైన ప్రతి మౌలిక వసతిని అందుబాటులోకి తీసుకువచ్చి ఓ మంచి ప్రాంతంగా తీర్చిదిద్దుతాం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మైనారిటీ సోదరులు చేసిన ఈద్గా ప్రహరీ నిర్మాణ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలిస్తామని, మతపరమైన ప్రదేశాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే హామీపై కాలనీవాసులు, మైనారిటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖాజా పీర్, నాయకులు శ్రీధర్, మదన్, బాబాజాన్, నదీం తదితరులున్నారు..