తిరుమల, ఆగస్టు 8 గరుడధాత్రి:
శ్రీవారి బ్రహ్మోత్సవాలు–2026కు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా గరుడసేవ రోజున భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని నియంత్రించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో భక్తులను సురక్షితంగా బయటకు తరలించేలా ప్రత్యేక నిష్క్రమణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసు, టీటీడీ విజిలెన్స్ విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందులో భాగంగా తిరుమల డీఎస్పీ, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు, తిరుమల II టౌన్ సీఐ, AVSOతో పాటు విజిలెన్స్ సిబ్బంది కీలక ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.
గరుడసేవ రోజున భక్తుల రాకపోకలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ప్రవేశం, నిష్క్రమణ మార్గాలు, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, బందోబస్తు అంశాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే భక్తులను సురక్షితంగా బయటకు తరలించేందుకు అనుసరించాల్సిన మార్గాలు, తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా లేపాక్షి సర్కిల్, SV షాపింగ్ కాంప్లెక్స్, SMC, సుపథం, రాగిమాను జంక్షన్ తదితర ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భక్తుల రద్దీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎక్కడ బందోబస్తు పెంచాలి? ట్రాఫిక్‌ను ఎలా మళ్లించాలి? అత్యవసర సమయంలో ఏ మార్గం ద్వారా భక్తులను సురక్షితంగా తరలించాలి? అనే అంశాలపై సమీక్షించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా కీలక ప్రాంతాల్లో అవసరమైన పోలీసు బలగాల మోహరింపు, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణతో పాటు ప్రవేశ–నిష్క్రమణ మార్గాల నిరంతర పర్యవేక్షణకు చర్యలు చేపడుతున్నారు.
క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన అంశాల ఆధారంగా పోలీసు, విజిలెన్స్ అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించి తుది భద్రతా కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా, శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని సంబంధిత విభాగాల సమన్వయంతో ముందస్తు ప్రణాళికను అమలు చేయనున్నట్లు జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది.