నాగలాపురంలో వైభవంగా కంచి గరుడసేవ
గరుడధాత్రి :
నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో శనివారం కంచి గరుడసేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. కంచిపురంలోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో జరిగే ప్రసిద్ధ గరుడసేవను పురస్కరించుకుని, శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ఈ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.ఈ సందర్భంగా సర్వాలంకార భూషితుడైన శ్రీ వేదనారాయణస్వామివారు ఉదయం గరుడవాహనంపై గ్రామవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. గరుడునిపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.వేదఘోషలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన ఈ దివ్యోత్సవం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలను పొందారు.ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.