* కుప్పానికి కృష్ణమ్మ జలాలు- రైతుల్లో తీరిన కరవు భయం.
* హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు, ప్రజలు.
* నేడు జలహారతి నిర్వహించనున్న సీఎం చంద్రబాబు.
కుప్పం,సెప్టెంబర్ 21 (గరుడ ధాత్రి న్యూస్):కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో కుప్పం ప్రాంత రైతులు, ప్రజలు ఆనందపరవశులవుతున్నారు. శ్రీశైలం నుండి కొండలు, గుట్టలు, ఎత్తు పల్లాలు దాటుకుంటూ హంద్రీనీవా కాలువ ద్వారా వస్తున్న నీటిని చూసి రైతులు ప్రజలు మురిసిపోతున్నారు. కాలువ వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడుతున్న కుప్పం ప్రాంతంలో కరవు తీర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో భగీరథ ప్రయత్నం చేశారని కొనియాడుతున్నారు. కృష్ణమ్మ రావడంతో తమ పంట పొలాలకు జీవం వస్తుందని, తాగునీటి కష్టాలు తీరుతాయని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 30న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం సమీపంలోని పరమ సముద్రం వద్ద కృష్ణా జలాలకు జల హారతి ఇచ్చారు. మళ్లీ విడత మంగళవారం సెప్టెంబర్ 22న శాంతిపురం మండలంలో కృష్ణా జలాలకు జల హారతి ఇవ్వనున్నారు. కృష్ణా జలాలలో కుప్పం నియోజకవర్గంలోని అన్ని చెరువులకు మళ్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిరోజు కుప్పం పర్యటన లో పేర్కొన్నారు.