GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 11:56 am Digital Edition : GURU SWAMY

గిరిజన రైతు గుడిసె కూల్చివేత కలకలం

నాగలాపురం జూన్ 11 గరుడధాత్రి :
40 ఏళ్లుగా సాగు చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్న గిరిజన రైతు తుపాకుల చెంగయ్య గుడిసెను ఉదయం 9గంట ల సమయం లో జేసీబీతో కూల్చివేయడం నాగలాపురం మండలంలో తీవ్ర సంచలనం రేపింది.
ఈ ఘటన వెనుక ఉన్న వారిని గుర్తించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
తిరుపతి జిల్లాలో మారుమూల ప్రాంతమైన నాగలాపురం మండలం కడివేడి ఎస్టీ కాలనీకి చెందిన గిరిజన రైతు తుపాకుల చెంగయ్య దాదాపు 40 సంవత్సరాలుగా సర్వే నంబర్ 30/2లో సుమారు మూడున్నర ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే ఆ భూమిపై గతంలో ఇతరుల పేరుతో డీకేటీ పట్టా మంజూరు కాగా, చెంగయ్య న్యాయపోరాటం ఫలితంగా ఆర్టీవో కోర్టు ఆ పట్టాను రద్దు చేసింది.
అయినప్పటికీ భూమి వివాదానికి పూర్తి పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో చెంగయ్య గుడిసెను తగులబెట్టిన ఘటన జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
తాజాగా జూన్ 10న ఉదయం 9గంటల సమయంలో జేసీబీతో చెంగయ్య నివాస ఉంటున్న గుడిసెను కూల్చివేయడం తీవ్ర కలకలం రేపింది. ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందన లేకపోయిందని, గ్రామ సర్పంచ్ జోక్యం తర్వాతే ఫిర్యాదు స్వీకరించిన్నట్లు తెలుస్తుంది.
చెంగయ్యకు భూమిపై హక్కు లేకపోతే గతంలో డీకేటీ పట్టా ఎందుకు రద్దు చేశారని, హక్కు ఉంటే ఇప్పటి వరకు పట్టా ఎందుకు ఇవ్వలేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గిరిజనుడిని భూమి నుంచి బలవంతంగా వెళ్లగొట్టేందుకు ప్రయత్నించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని గ్రామ ప్రజలు మండి పడుతున్నారు.
ఈ ఘటనపై జిల్లా స్థాయి అధికారులు సమగ్ర విచారణ జరిపి, గుడిసె కూల్చివేతకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చెంగయ్య కుటుంబానికి రక్షణ కల్పించాలని, భూమి సమస్యను తక్షణమే పరిష్కరించి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.