గుండెపోటుతో వీఆర్ఏ ఈశ్వర్ మృతి
కుటుంబంలో విషాదం.. ప్రభుత్వ సహాయం కోరుతున్న బంధువులు
పిచ్చాటూరు మే 22 గరుడధాత్రి న్యూస్ :
పిచ్చాటూరు మండలంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న ఈశ్వర్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గురువారం విధులు ముగించుకుని నాగలాపురం మండలం వినోబా నగర్‌లోని తన నివాసానికి చేరుకున్న ఈశ్వర్, ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.
ఈశ్వర్ మృతితో భార్య, రెండేళ్ల చిన్నారి కుమార్తె దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉన్న ఈశ్వర్ ఆకస్మిక మరణం స్థానికులను కలిచివేసింది.
మరణ వార్త తెలిసిన వెంటనే రెవెన్యూ శాఖ సిబ్బంది, వీఆర్వోలు, వీఆర్ఏలు, సహచర ఉద్యోగులు ఆయన నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విధి నిర్వహణలో నిబద్ధత కలిగిన ఉద్యోగిగా ఈశ్వర్ సేవలను వారు స్మరించుకున్నారు.
తహసీల్దార్ వై చంద్రబాబు నాయుడు ఈశ్వర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం తరఫున తక్షణ సాయంగా రూ.15 వేల నగదు అందజేశారు. అలాగే ఈశ్వర్ భార్యకు తాత్కాలిక ఉద్యోగావకాశం కల్పించడంతో పాటు, ఆయనకు రావలసిన అన్ని బెనిఫిట్స్ త్వరలో అందజేస్తామని తహసీల్దార్ తెలిపారు.
మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకుని, భార్యకు శాశ్వత ఉద్యోగం కల్పించి చిన్నారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని బంధువులు, స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.