GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 9:31 pm Digital Edition : GURU SWAMY

గోవింద నామస్మరణల మధ్య ప్రారంభమైన శ్రీనివాసమంగాపురం వసంతోత్సవాలు

గోవింద నామస్మరణల మధ్య ప్రారంభమైన శ్రీనివాసమంగాపురం వసంతోత్సవాలు

మే 08న కనులపండువగా స్వర్ణ రథోత్సవం

సాక్షాత్తు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రతిరూపంగా భక్తుల అర్చనలు అందుకుంటున్న శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గోవింద నామస్మరణలతో, మంగళవాయిద్యాల నినాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
వసంత ఋతువులో ప్రకృతి ప్రసాదించిన పుష్పాలు, ఫలములను స్వామివారికి సమర్పించి కలియుగ వైకుంఠ వాసుడు శ్రీనివాసుని అనుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవాల అంతరార్థమని అర్చకులు తెలిపారు. భక్తుల హృదయాలలో భక్తి, ప్రశాంతత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపే ఈ ఉత్సవాలు ప్రత్యేకమైనవిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
వైఖానస మాసంలోని శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ మూడు రోజుల ఉత్సవాలకు తొలి రోజున విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 8.30 గంటలకు మలయప్పస్వామివారు ఉభయ నాంచారులతో ఆలయం నుండి వసంత మండపానికి వేంచేపు చేయగా, గోవింద నామాలతో ఆలయ వీధులు మారుమోగాయి.
మధ్యాహ్నం 2.00 గంటల నుండి 4.00 గంటల వరకు వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పుష్పాలతో నిర్వహించిన అభిషేక సేవ భక్తులను పరవశింపజేసింది. అనంతరం ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు. సాయంత్రం తిరువీధుల ఉత్సవంలో స్వామివారు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి అనుగ్రహించనున్నారు.
వసంతోత్సవాలను పురస్కరించుకొని మూడు రోజుల పాటు నిర్వహించే ఆర్జిత సేవలైన నిత్య కల్యాణోత్సవం, అలాగే మే 07న తిరుప్పావడ సేవలను టిటిడి రద్దు చేసింది. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

మే 08న స్వర్ణ రథోత్సవం:
వసంతోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే స్వర్ణ రథోత్సవం మే 08వ తేదీ శుక్రవారం సాయంత్రం 6.00 గంటలకు జరగనుంది. బంగారు తేజస్సుతో అలంకరించిన స్వర్ణ రథంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య మంగళ దర్శనం ఇవ్వనున్నారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, సూపరింటెండెంట్ శ్రీ రమేశ్, ఆలయ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్, శ్రీ ధనశేఖర్, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, పలువురు అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.