GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 7:13 am Digital Edition : GURU SWAMY

గ్రామ పరిశుభ్రతపై కళాజాత కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కార్యక్రమం

ఎంపీడీఓ ఆనందబాబు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు7
బైరెడ్డిపల్లి మండలంలోని గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కళాజాత కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ ఆనందబాబు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. ప్రతిరోజూ రెండు నుంచి మూడు గ్రామ పంచాయతీల్లో
ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలు, విద్యార్థులకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరిస్తున్నామన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి ఇవ్వాలని, రోడ్లపై, కాలువల్లో, ఖాళీ స్థలాల్లో చెత్తను వేయకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల నివారణ కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, తాగునీటిని మరిగించి వినియోగించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వంటి ఆరోగ్య సూత్రాలను పాటించడానికి ఈ విధానం అవలంభిస్తున్నామని పేర్కొన్నారు.
అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నివారించాలని, వాటికి బదులుగా వస్త్ర సంచులు, పర్యావరణహిత వస్తువులను వినియోగించాలని ఈ బృందం ద్వారా ప్రచారం చేస్తున్నామని తెలిపారు.
కళాజాత బృందాల ద్వారా పాటలు, నాటికలు, ప్రదర్శనల రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, తద్వారా పరిశుభ్రత పట్ల ప్రజల్లో స్పష్టమైన అవగాహన పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా “స్వచ్ఛ బైరెడ్డిపల్లి” లక్ష్య సాధన దిశగా పంచాయతీ రాజ్ అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని ఎంపీడీఓ కె.ఆనందబాబు తెలిపారు.