‘ప్రజా ఆశీర్వాద్ దీపం’ కార్యక్రమం నిర్వహించిన కూటమి నాయకులు
రామచంద్రాపురం: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను రామచంద్రాపురం మండలంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. గురువారం మండల కేంద్రంలోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ‘ప్రజా ఆశీర్వాద్ దీపం’ కార్యక్రమాన్ని నిర్వహించి దీపాలను వెలిగించారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు జనార్దన్ నాయుడు మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, భారత ప్రధానిగా 12 సంవత్సరాలుగా ప్రజలకు సేవలందించడం గర్వించదగ్గ విషయమన్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానికంగా కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తిరుమలరెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు సంజీవి హరి, నాయకులు గిరిధర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, గోపీనాథ్ రెడ్డి, శేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.