గొల్లపల్లి అంగన్వాడీ కేంద్రం, ఏరియా ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాలు
పలమనేరు, ఆగస్టు 4 ( గరుడ ధాత్రి ) :
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పలమనేరు ప్రాజెక్ట్ పరిధిలోని గొల్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరి, ఐసిడిఎస్ సీడీపీవో ఉమారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శిశువు జన్మించిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరమని తెలిపారు. మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే అందించాలని, ఆరు నెలల తర్వాత తగిన పౌష్టికాహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలు కొనసాగించడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. అదేవిధంగా పలమనేరు ఏరియా ఆసుపత్రిలో బాలింతలకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. తల్లిపాలు పట్టే సరైన పద్ధతులు, తల్లి తీసుకోవాల్సిన పోషకాహారం, శిశువు ఎదుగుదల, సాధారణంగా ఎదురయ్యే సమస్యలు-వాటి పరిష్కారాలపై వైద్య సిబ్బంది, ఐసిడిఎస్ సిబ్బంది సమగ్రంగా అవగాహన కల్పించారు. “తల్లిపాలు – శిశువుకు మొదటి టీకా, సంపూర్ణ పోషకాహారం” అనే సందేశాన్ని ప్రతి కుటుంబానికి చేరవేయాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు మాధవి లత, నజ్మా, అంగన్వాడీ టీచర్లు సరస్వతి, జ్యోతిస్వరి, నాగమణిలతో పాటు ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, గర్భిణులు, బాలింతలు మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.