GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 6:54 pm Digital Edition : GURU SWAMY

చిత్తూరు నగరాభివృద్ధి పై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి

* రూ. 14 కోట్లతో వేగంగా సాగుతున్న రోడ్ల విస్తరణ, డ్రైనేజీలు, వీధి దీపాల పనులు.
* ద్విచక్ర వాహనం పై, కాలినడకన పనులను పర్యవేక్షించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.
* అంతర్జాతీయ ప్రమాణాలతో జిల్లా కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని వెల్లడించిన ఎంపీ, ఎమ్మెల్యేలు.
* చిత్తూరు నగర ప్రజలు అందించిన సహకారం మరువలేనిదన్న ప్రజాప్రతినిధులు.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 04 (గరుడ ధాత్రి న్యూస్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు నగరాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించారని, ఆయన నాయకత్వంలో జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరం ప్రగతి పథం వైపు వేగంగా అడుగులు వేస్తోందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ రావు సంయుక్తంగా ప్రకటించారు. నగర అభివృద్ధికి చిత్తూరు ప్రజలు అందిస్తున్న సహకారం ఎన్నటికీ మరువలేనిదని వారు కొనియాడారు.చిత్తూరు నగరంలో రూ. 14 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, మరియు వీధి దీపాల ఏర్పాటు పనుల పురోగతిని ఆదివారం ఎంపీ, ఎమ్మెల్యేలు స్వయంగా పరిశీలించారు. అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకునేందుకు వీరిద్దరూ ద్విచక్ర వాహనం (బైక్) పై నగరంలో పర్యటించారు.
అనంతరం, నగర కూటమి నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్చార్జులు, ప్రభుత్వ అధికారులుతో కలిసి వీధుల్లో నడుస్తూ, ప్రజలతో మమేకమయ్యారు. పనుల నాణ్యతను, వేగాన్ని పరిశీలిస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ రావు విలేకరులతో మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న నగర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. రూ. 14 కోట్ల నిధులతో ప్రస్తుతం జరుగుతున్న మౌలిక వసతుల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో చిత్తూరు జిల్లా కేంద్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో, అన్ని హంగులతో కూడిన సుందర నగరంగా తీర్చిదిద్దడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న ప్రోత్సాహంతో చిత్తూరు రూపురేఖలు మారబోతున్నాయని, ఈ మహా యజ్ఞంలో ప్రజలు, వ్యాపారస్థులు మరికొంత కాలం ఓపికతో సహకరించాలని వారు కోరారు.