* వైద్య సేవలు, మందుల పంపిణీ, మౌలిక వసతులపై పరిశీలన.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 03(గరుడ ధాత్రి న్యూస్): చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సందర్శించి వైద్య సేవలు, రోగులకు అందుతున్న సదుపాయాలు, మందుల పంపిణీ, మౌలిక వసతులపై సంబంధిత సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమర్జెన్సీ ల్యాబ్‌ను పరిశీలించిన కలెక్టర్, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అందుతున్న పరీక్షలు, సేవల తీరుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగుల పరిస్థితి, వారికి అందుతున్న వైద్య సేవలపై కూడా ఆరా తీశారు.అనంతరం సిటీ స్కాన్ విభాగం, ఫార్మసీ, ఫార్మసీ స్టోర్ తదితర విభాగాలను పరిశీలించి, రోగులకు మందులు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా అనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.ఎంఆర్ఐ బ్లాక్‌లో మౌలిక వసతులు, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, ఆపరేషన్ థియేటర్‌ను కూడా సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఆసుపత్రిలో నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఏపీఎంఎస్‌డీసీ అధికారులు, డీఈఈఈ, ఎస్‌టీఎఫ్ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం పాత ఫార్మసీని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫిమేల్) ట్రైనింగ్ స్కూల్ మరియు హాస్టల్‌ను కూడా సందర్శించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థినులతో మాట్లాడి వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, ఏ అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని వారికి హామీ ఇచ్చారు.ఆసుపత్రిలో అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు.అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ పారిశుధ్య నిర్వహణపై సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య సేవలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, సిబ్బంది హాజరు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఆసుపత్రి సూపర్డెంట్ ఉషశ్రీ,
ఈ తనిఖీలో ఏపీఎంఎస్‌డీసీ అధికారులు, డీఈఈఈ, ఎస్‌టీఎఫ్ సభ్యులు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, అపోలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.