-ఏసీ లేక దుమ్ముతో మూలుగుతున్న యంత్రాలు.. ఖాతాదారుల ఆవేదన
నాగలాపురం, జూన్ 3 గరుడధాత్రి : నాగలాపురంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కేంద్రం అవ్యవస్థలకు నిలయంగా మారిందని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎం కేంద్రం పరిసరాలు చెత్తాచెదారాలతో నిండిపోవడంతో నగదు లావాదేవీల కోసం వచ్చే వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ప్రతిరోజూ వందలాది మంది ఖాతాదారులు ఉపయోగించే ఈ ఏటీఎం కేంద్రంలో కనీస పరిశుభ్రత ప్రమాణాలు కూడా పాటించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. కేంద్రం చుట్టూ పేరుకుపోయిన చెత్త కారణంగా అసహ్యకర వాతావరణం నెలకొన్నట్లు పేర్కొంటున్నారు.
ఇక ఏటీఎం కేంద్రంలో ఏసీ సదుపాయం లేకపోవడం లేదా పనిచేయకపోవడంతో తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఖాతాదారులు చెబుతున్నారు. దీంతో రోడ్డుపై నుంచి వచ్చే దుమ్ము నేరుగా యంత్రాలపై చేరి వాటి పనితీరుపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దుమ్ము పేరుకుపోవడం వల్ల ఏటీఎం యంత్రం తరచూ సాంకేతిక సమస్యలకు గురవుతూ నగదు ఉపసంహరణలో అంతరాయం కలుగుతోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. బ్యాంకు అధికారులు ఖాతాదారుల నుంచి ఏటీఎం సర్వీస్ ఛార్జీలు, ఇతర సేవా రుసుములు క్రమం తప్పకుండా వసూలు చేస్తున్నప్పటికీ, ఏటీఎం కేంద్రం నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఖాతాదారుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఏటీఎం కేంద్రాన్ని శుభ్రపరిచి, ఏసీ సదుపాయాన్ని పునరుద్ధరించి, యంత్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు, ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.