GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 11:54 am Posted by : GURU SWAMY

జలధార–జలహారతితో నాగలాపురం మండలానికి జలకళ

జలధార–జలహారతితో నాగలాపురం మండలానికి జలకళ
-రూ.1.57 కోట్లతో 68 జల సంరక్షణ పనులు – 3612 ఎకరాలకు సాగునీటి లబ్ధి

నాగలాపురం మే 22 గరుడధాత్రి :
తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో జలధార–జలహారతి కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలకు కొత్త ఆశలను నింపుతోంది. వర్షపు నీటిని ప్రతి చుక్క భూమిలో నిల్వ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా కాలువలు, చెరువులు, చెక్‌డ్యాంల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనుల ఫలితంగా రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడటంతో పాటు భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి మేలు చేకూరనుంది.
నాగలాపురం మండలంలో రూ.1.57 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 68 పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేశారు. ఇందులో 26 ఫీడర్ కాలువల పునరుద్ధరణ, 20 ఫీల్డ్ కాలువల మరమ్మతులు, 6 చెక్‌డ్యాంల పూడికతీత, 5 చెరువుల శుభ్రపరిచే పనులు, 5 కందకాల నిర్మాణం, 6 నీటి కుంటల పూడికతీత పనులు ఉన్నాయి. ఈ పనుల ద్వారా మండలంలోని సుమారు 3612 ఎకరాల సాగుభూమికి నీటి లబ్ధి కలగనుంది.
నాగలాపురం గ్రామపంచాయితీలో ఉపాధి హామీ పథకం కింద 50 మంది కూలీలతో రఘురెడ్డి పొలం నుంచి శెల్వం పొలం వరకు 1000 మీటర్ల పొడవున పంటకాలువ పూడికతీత పనులు చేపడుతున్నారు. రూ.1.36 లక్షల అంచనా వ్యయంతో జరుగుతున్న ఈ పనుల ద్వారా పిచ్చాటూరు అరణ్యార్ ప్రాజెక్టు నుంచి ఎర్రచెరువు ద్వారా వచ్చే సాగునీరు నాగలాపురం, కొట్టకాడు, వెంబాకం, బైటకొడింబీడు, నందనం ప్రాంతాల రైతులకు చేరనుంది.
ఈ కాలువ పరిధిలోని 423 ఎకరాల భూములకు సాగునీరు అందడమే కాకుండా 53 బోర్లు, 17 బావుల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. వరి, వేరుశనగ, మామిడి వంటి పంటలకు ఈ నీరు ఎంతో ఉపయోగపడనుంది.
ఉపాధి హామీ వేతనదారుడు శ్రీ బాలాజీ మాట్లాడుతూ జలధార–జలహారతి పనుల వల్ల రైతులకు సాగునీటి ఇబ్బందులు తగ్గుతాయని, భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి మేలు జరుగుతుందని తెలిపారు. రోజుకు రూ.307 వరకు వేతనం లభించడం వల్ల వేసవిలో వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే ఉపాధి దొరుకుతోందన్నారు.
ఈ పనుల వల్ల పశువులు, గొర్రెలు, మేకలకు త్రాగునీటి సమస్య కూడా తీరనుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూడికతీతతో కాలువలు మళ్లీ జీవం పొంది చెరువులు నిండుకుండల్లా మారనున్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి తేజశ్రీ, ఏపీఓ సుధాకర్, చంగల్‌రాయులు, సోమయాజులు, శైలజ, ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.