-అఖిల భారత రైతు కూలీ సంఘం పిలుపు
పిచ్చాటూరు, సెప్టెంబర్ 21 గరుడధాత్రి న్యూస్ :
ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం పిచ్చాటూరు మండల కార్యదర్శి జి. దక్షిణామూర్తి పిలుపునిచ్చారు. మహాసభల విజయవంతానికి పిచ్చాటూరు మండల కేంద్రంలో సంఘం ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా దక్షిణామూర్తి మాట్లాడుతూ జాతీయ మహాసభల విజయవంతానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలో కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. మహాసభల నిర్వహణకు ప్రజలు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశాండీ అరుణాచలం జెండా ఊపి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సంఘం ప్రధాన డిమాండ్లు:
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత తీవ్ర వర్షాభావ పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ట్రానికి ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీ విడుదల చేయాలని సంఘం డిమాండ్ చేసింది. వర్షాభావ, కరువు ప్రభావిత మండలాలను శాస్త్రీయంగా గుర్తించి అధికారికంగా ప్రకటించాలని కోరింది.
మండలాల వారీగా పంట నష్టం అంచనా వేసి నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం వెంటనే అందించాలని, కరువు ప్రాంతాల్లో రైతుల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని పేర్కొంది.
పంటలను కాపాడేందుకు రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు, ఎత్తిపోతల పథకాల ద్వారా అందుబాటులో ఉన్న నీటిని అత్యవసరంగా వినియోగించడంతో పాటు అవసరమైన నీటి రవాణా ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేసింది. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు ఉచిత విత్తనాలు అందించాలని కోరింది.
కరువు నివారణ చర్యల్లో భాగంగా బియ్యంతో పాటు 16 రకాల నిత్యావసర సరుకులను రేషన్ షాపుల ద్వారా ఉచితంగా లేదా సబ్సిడీపై పంపిణీ చేయాలని, కరువు ప్రభావిత రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులకు నెలకు రూ.10 వేల చొప్పున కరువు పింఛన్ మంజూరు చేయాలని సంఘం కోరింది.
చేతివృత్తిదారులు తీసుకున్న రుణాలను పూర్తిగా రద్దు చేసి, వారి జీవనోపాధి పునరుద్ధరణకు సబ్సిడీతో కూడిన కొత్త రుణాలు అందించాలని, ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.600 వేతనం చెల్లించాలని డిమాండ్ చేసింది.
కరువు ప్రాంతాల్లో విద్యార్థుల ఫీజులను పూర్తిగా మాఫీ చేసి, చదువులు కొనసాగించేందుకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని, పశువులకు తాగునీరు, పశుగ్రాసం, దాణా అందించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరింది.
అలాగే గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆహార శుద్ధి కేంద్రాలు, చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సంఘం డిమాండ్లను వెల్లడించింది.
ఈ ప్రచార కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్. మురుగేషన్, దినమని, పద్మ, వసంత, శ్రీవల్లి, వినోదమ్మ తదితరులు పాల్గొన్నారు.