GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 7:53 pm Posted by : GURU SWAMY

*జిల్లాలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు

*జిల్లాలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు*

*అపోహలు నమ్మొద్దు: జేసీ వెంకటేశ్వర్లు*

నెల్లూరు, ఏప్రిల్ 26: జిల్లాలో ఎక్కడా కూడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని, అసత్య ప్రచారాలను నమ్మి వాహనదారులు ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు.

ఆదివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని శంకరన్ సమావేశ మందిరంలో, జిల్లాలో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న అపోహలపై డీఎస్ఓ లీలారాణితో కలిసి జాయింట్ కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 243 పెట్రోల్ పంపుల్లో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల కమిషనర్ ఆదేశాల మేరకు ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎక్కడా కొరత లేకుండా నిరంతర సరఫరా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయిల్ కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని చెప్పారు.

జిల్లాలో ఇంధన సరఫరా సక్రమంగా కొనసాగుతున్నప్పటికీ, కొరత ఉందనే అపోహల కారణంగా కొన్ని పెట్రోల్ బంకుల్లో రద్దీ కనిపిస్తున్నదని పేర్కొన్నారు. వినియోగదారులు అవసరమైన మేరకు మాత్రమే పెట్రోల్, డీజిల్ తీసుకోవాలని సూచించారు.

క్యాన్‌లు, బాటిల్స్‌లో పెట్రోల్, డీజిల్ నింపడం నిషేధించబడినదని, అటువంటి చర్యలు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రజలు సహకరించాలని కోరారు. వ్యవసాయం, ఆక్వా రంగాలకు అవసరమైన డీజిల్ సరఫరా నిరంతరంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

జిల్లాలోని ప్రతి రీఫిల్లింగ్ స్టేషన్‌ను పర్యవేక్షించేందుకు తహసీల్దార్లు, పౌర సరఫరాల ఉప తహసీల్దార్లను నియమించి నిల్వల పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ కంపెనీలు అప్పు ప్రాతిపదికన సరఫరా చేయని కారణంగా జిల్లాలోని 15 పెట్రోల్ బంకుల్లో మాత్రమే తాత్కాలికంగా ఇంధనం అందుబాటులో లేదని, మిగిలిన అన్ని బంకుల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు.

ఏ పెట్రోల్ బంక్ యాజమాన్యం నో-స్టాక్ బోర్డులు పెట్టినా లేదా కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని జేసీ హెచ్చరించారు. వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా 9492273897 ఫోన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో ఏఎస్ఓ లక్ష్మీనారాయణ రెడ్డి పాల్గొన్నారు.