* గాండ్ల తెలికుల సంక్షేమానికి నిరంతర కార్యాచరణ
*స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశావహులు పోటీ చేయండి * త్వరలో గాండ్ల తెలికుల వెబ్సైట్ ఏర్పాటు, సభ్యత్వాల స్వీకరణ.. * కులాభివృద్ధి కోసం సోషల్ మీడియాలు వేదికగా చేసుకుందాం
* జూమ్ మీట్ లో రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ
తిరుపతి,అక్టోబర్ 02 ( గరుడ ధాత్రి ) :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్త గాండ్ల తెలికుల ప్రజా సంక్షేమ సంఘం (ఎస్ జీ టీ పీ ఎస్ ఎస్), అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం(ఏ జీ టీ యూ పీ ఎస్ ఎస్)ను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ స్పష్టం చేశారు. ఎస్ జీ టీ పీ ఎస్ ఎస్, ఏ జీ టీ యూ పీ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సంయుక్త రాష్ట్ర స్థాయి గూగుల్ మీట్ (అంతర్జాల సమావేశం) అధ్యక్షుడు వాకాటి హరికృష్ణ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు సంఘాల రాష్ట్ర నాయకులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అన్నమయ్య, అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి, కడప, నంద్యాల, సత్యసాయి, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, కృష్ణాజిల్లా తదితర జిల్లాల నాయకులు ఈ గూగుల్ మీట్ వేదికలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో గాండ్ల తెలికుల సంక్షేమం కోసం భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. గాండ్ల తెలికుల కులస్తుల ఐక్యతను మరింత బలోపేతం చేయడం, పరస్పర విభేదాలు, అపోహలను పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు సాగడంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా వాకాటి హరికృష్ణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాండ్ల తెలికుల సంక్షేమం, ఉనికిని చాటుకోవడం కోసం తాము నిరంతరం కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో కులస్తులను, విదేశాల్లో ఉన్న కుల బంధువులను ఏకం చేయడం కోసం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటామని, ఆదిశగా వెబ్సైట్ ను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.
*రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం పెంచుకోవాలి*
అలాగే రాజకీయ ప్రాతినిధ్యం పెంచుకోవడం కోసం ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు స్థానిక సంస్థలు మున్సిపాలిటీలు ఎన్నికల్లో పోటీ చేయాలని, అందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. తద్వారా గాండ్ల తెలికుల సమాజం ఐక్యత, ఉనికి సమిష్టి శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు తమ కులస్తులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం కోసం సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇక తమ సామాజిక వర్గం పరంగా.. ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన సంఘంలో కొనసాగేందుకు స్వేచ్ఛ ఉందని, అయితే కుల ఐక్యతకు భంగం కలిగించే విధానాలను విడనాడి మన సమాజ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా, క్రియాశీలకంగా పని చేయాలని కోరారు. అతి త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయా జిల్లాల కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, ఆ జిల్లాల్లో గాండ్ల తెలికుల సమాజానికి విద్యా, వైద్యం, ఇతర సంక్షేమ సదుపాయాలను ప్రభుత్వం ద్వారా సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలని ముక్తకంఠంతో ఏకాభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఆ మేరకు నిర్ణయించారు. ముఖ్యంగా గాండ్ల తెలికుల కార్పొరేషన్ సాధించడానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సమావేశంలో నాయకులు ఆకాంక్షించారు. దీంతో స్పందించిన అధ్యక్షుడు వాకాటి హరికృష్ణ.. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే, సమస్త గాండ్ల తెలికుల ప్రజా సంక్షేమ సంఘం ఏ ఇతర సంఘాలకు పోటీ కాదని స్పష్టం చేశారు.
కులాభివృద్ధికి పాటుపడే ఎవరినైనా తాము గౌరవిస్తామని, ఈ సంఘాలైన కులస్తుల సంక్షేమ అభివృద్ధికి పాటుపడితే స్వాగతిస్తామన్నారు.
“విభేదాలు, వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి గాండ్ల తెలికుల కుల ఐక్యత, కుల అభివృద్ధి భవిష్యత్ తరాల సంక్షేమం కోసం అందరూ ఒకే మాటపై, ఒకే తాటిపై ముందుకు సాగాలి, ప్రత్యేక వెబ్సైటు, ప్రతేక నిధిని ఏర్పాటు చేసుకుని కుల సంఘం ముందుకు వెళదాం”అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర సైద్ధాంతిక సలహాదారు గిరి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తిని సత్యనారాయణ, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షులు నెల్లూరుపల్లి విశాలాక్షి, చదివే విష్ణుమమత (కదిరి), రాష్ట్ర ఉపాధ్యక్షుడు,మీడియా సెక్రటరీ కేపి కుమార్, రాష్ట్ర యువజన అధ్యక్షుడు సింగవరపు రామకృష్ణ,చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఎ. ఆర్. కుమార్, కడప జిల్లా గౌరవ అధ్యక్షుడు వీరపు లక్ష్మీపతి, జక్కము నాగభూషణం, ఉదయభాస్కర్, అనంతపురం జిల్లా నుంచి ముత్యాల ఆదినారాయణ, తిరుపతి జిల్లా నుంచి మొద్దేమ్ విజయకుమార్, సత్యసాయి జిల్లా నుంచి చదివే సూరినారాయణ, కాలసముద్రం హరికుమార్, అన్నమయ్య జిల్లా నుంచి నారు శ్రీధర్, ఈశ్వరయ్య, తదితర రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.