GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 6:21 pm Digital Edition : GURU SWAMY

జేబీఆర్ జూనియర్ కళాశాలలో ఘనంగా ‘నవతరంగం’ ఫ్రెషర్స్ డే నిర్వహణ

పిచ్చాటూరు, ఆగస్టు 2 గరుడధాత్రి :

తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలోని ప్రముఖ విద్యాసంస్థ జేబీఆర్ జూనియర్ కళాశాలలో ఆదివారం “నవతరంగం” ఫ్రెషర్స్ డే కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పబ్లిక్ స్పీకర్, రచయిత మహేష్ మిరపుల మరియు పిచ్చాటూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా మహేష్ మిరపుల మాట్లాడుతూ, పిల్లల పెంపకంలో ప్రేమతో పాటు క్రమశిక్షణ కూడా ఎంతో అవసరమని తల్లిదండ్రులకు సూచించారు. జెంటిల్ పేరెంటింగ్ కంటే అథారిటేటివ్ పేరెంటింగ్ పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, భవిష్యత్తు విజయాలకు మరింత దోహదపడుతుందని వివరించారు. క్రమశిక్షణతో కూడిన పట్టుదల, నిరంతర ప్రయత్నం ప్రతి వ్యక్తిని విజయతీరాలకు చేర్చుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ పుస్తకాలను తమ ప్రాణస్నేహితులుగా చేసుకుంటే జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడంతో పాటు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగగలరని ప్రేరణాత్మకంగా చెప్పారు.
అనంతరం సబ్ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర మాట్లాడుతూ, విద్యార్థులు చట్టాలపై అవగాహనతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని సూచించారు. మంచి నడవడి, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన జీవనశైలి ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన షైనింగ్ స్టార్ విద్యార్థి వై. జగదీష్ కు రూ.5,000 నగదు బహుమతి, మెమెంటో అందజేశారు. ద్వితీయ స్థానం సాధించిన బి. తేజశ్రీ యాదవ్ కు రూ.3,000 నగదు బహుమతి, మెమెంటో ప్రదానం చేశారు.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ప్రథమ స్థానం సాధించిన డి. ఐశ్వర్యకు రూ.2,000 నగదు బహుమతి, మెమెంటో అందజేశారు. ప్రథమ సంవత్సరం యంపిసి విభాగంలో ప్రథమ స్థానం సాధించిన గోపికకు రూ.2,000, ద్వితీయ స్థానం సాధించిన కె.ఆర్. జోనిషాకు రూ.1,000 నగదు బహుమతి, మెమెంటోలు అందించారు. బైపిసి విభాగంలో ప్రథమ స్థానం సాధించిన రేష్మాకు రూ.2,000, ద్వితీయ స్థానం సాధించిన స్పందనకు రూ.1,000 నగదు బహుమతి, మెమెంటోలు ప్రదానం చేశారు. సీఈసీ విభాగంలో ప్రథమ స్థానం సాధించిన షహీదా బానుకు రూ.2,000 నగదు బహుమతి, మెమెంటో అందజేశారు.
అదేవిధంగా, ప్రతిభ కనబర్చిన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
మ్యాథ్స్, సైన్స్, తెలుగు సబ్జెక్టుల్లో 100/100 మార్కులు, కెమిస్ట్రీలో 85/85 మార్కులు సాధించిన విద్యార్థులు జగదీష్, సిద్ధు, గోపిక, జోనిషా, రుషికేష్, కుమరన్, దుస్వంత్, ధనుష్, స్పందనలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా నగదు బహుమతులు, మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డా. బి. మునిరత్నం ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె. హేమాద్రి, పాఠశాల ప్రిన్సిపాల్ ఎం. భూలక్ష్మి, ఏఓ అంకయ్య, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.