GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 7:58 am Digital Edition : GURU SWAMY

టిల్‌ హెల్త్‌కేర్‌ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి – సిఐటియు

మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి
సీఐటీయూ ఆధ్వర్యంలో పరిశ్రమ ఎదుట ధర్నా

సత్యవేడు అక్టోబర్ 03 గరుడధాత్రి :

శ్రీ సిటీ పరిధిలోని టిల్‌ హెల్త్‌కేర్‌ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని, క్షతగాత్రులకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
ప్రమాదాన్ని నిరసిస్తూ సీఐటీయూ తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పరిశ్రమ ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి మాట్లాడుతూ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలుపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని కోరారు. ప్రమాదానికి బాధ్యులైన పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
నివాస ప్రాంతాలకు సమీపంలో ఫార్మా పరిశ్రమకు అనుమతులు ఎలా ఇచ్చారనే అంశంపై కూడా విచారణ జరపాలని కోరారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉపాధి, క్షతగాత్రులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ధర్నా అనంతరం నాయకులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. చెరివి గ్రామంలో మృతుడు మస్తాన్‌ కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించారు. పేలుడు ధాటికి పరిశ్రమలోని గోడలు, అద్దాలు, తలుపులు దెబ్బతిన్నాయని తెలిపారు. పారిశ్రామిక ప్రమాదాల నివారణకు భద్రతా తనిఖీలను పటిష్ఠం చేయాలని కోరారు.
కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.సుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షుడు ఎస్‌.జయచంద్ర, జిల్లా కార్యదర్శి ఎన్‌.డి.శ్రీనివాసులు, స్థానిక నాయకులు జనార్ధన్‌, రమేశ్‌, తిరుమలరెడ్డి, బాలగురవయ్య, నాగరాజు, ఏఐటీయూసీ నాయకులు చిన్నిరాజ్, ధనంజయ చౌదరి తదితరులు పాల్గొన్నారు.