నారాయణవనం, ఆగస్టు 3 గరుడధాత్రి:
తిరుపతి జిల్లా నారాయణవనంలో ఓ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి లైంగిక, మానసిక వేధింపులే ఆత్మహత్యకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నారాయణవనం బీసీ కాలనీలో నివాసముంటున్న హంస–గోపి దంపతుల చిన్న కుమార్తె జీవ (17) ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసి బీటెక్‌లో ప్రవేశం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో గతంలో నారాయణవనం బాయ్స్ హైస్కూల్‌లో సోషల్ టీచర్‌గా పనిచేసి ప్రస్తుతం ఎంపీయూపీ తమిళ హైస్కూల్‌లో విధులు నిర్వహిస్తున్న మునివేలు, తనకు ఇంజినీరింగ్ కళాశాలలతో పరిచయాలు ఉన్నాయని, తక్కువ ఫీజుతో సీటు ఇప్పిస్తానని నమ్మించి పలుమార్లు వివిధ కళాశాలలకు తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గత నెల 28న కూడా కార్వేటినగరం డైట్‌కు తీసుకెళ్లినప్పటికీ చివరకు ఎక్కడా సీటు ఇప్పించకపోవడంతో జీవ తీవ్ర మనోవేదనకు గురైనట్లు పేర్కొన్నారు.
గురువారం సాయంత్రం ఇంట్లో పై అంతస్తు గదికి వెళ్లిన జీవ, రాత్రి భోజనానికి కిందకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. గది తలుపు లోపల నుంచి లాక్ చేసి ఉండటంతో పగులగొట్టి చూడగా, ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. తొలుత సీటు రాలేదన్న బాధతో ఆత్మహత్య చేసుకుందని భావించిన కుటుంబ సభ్యులు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే అనంతరం జీవ మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, ఉపాధ్యాయుడితో జరిగిన కాల్స్, డిలీట్ చేసిన వీడియో కాల్స్, అలాగే అసభ్యకరమైన చాట్ సందేశాలు బయటపడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో తన కుమార్తె ఆత్మహత్యకు టీచర్ మునివేలు లైంగిక, మానసిక వేధింపులే కారణమని ఆరోపిస్తూ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి హంస నారాయణవనం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నారాయణవనం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నందున, వాస్తవాలు పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.